Have you received an IT notice, don't worry, follow these tips
mictv telugu

ఐటీ నోటీసు వచ్చిందని కంగారు పడుతున్నారా, అయితే టెన్షన్ వద్దు, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..!!

January 6, 2023

ఐటీ డిపార్ట్ మెంట్ నుంచి నోటీసు వచ్చిందంటే చాలు చాలామంది కంగారు పడిపోతుంటారు. తమ మీద రైడ్ జరుగుతుందని, డబ్బంతా తీసుకెళ్ళిపోతారు అనే అపోహ చాలా మందిలో ఉంది. సాధారణంగా సినిమాల్లోనూ, మీడియా వార్తల్లోనూ ఐటీ రైడ్స్ గురించి చూడటం వల్లనే ఈ తరహా భయం నెలకొని ఉంటుంది. కానీ ఐటీ నోటీసులు చూడగానే ఏమాత్రం భయపడవద్దు. అసలు ఆ నోటీసు ఎందుకు పంపారో, పూర్తిగా చదవాలి. ఒక్కోసారి మనం రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు చెల్లించాల్సిన పన్ను కన్నా ఎక్కువ చెల్లించినప్పుడు కూడా ఐటీ శాఖ ఆ విషయం మీకు తెలియ చేసేందుకు నోటీసు పంపుతుంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీ రిటర్న్) ఫైల్ చేస్తున్నప్పుడు అందులో ఏదో ఒక పొరపాటు జరిగడం సహజమే. పన్ను రిటర్న్‌ చేస్తున్న సమయంలో తప్పులు అనేక రకాలుగా జరగవచ్చు. చెల్లించిన మొత్తం కంటే తక్కువ పన్ను చెల్లించడం లేదా ఏదైనా అవసరమైన పత్రాలను పూర్తి చేయకపోవడం వంటివి జరుగుతాయి. అలాంటి సమయంలో ఐటీ శాఖ సెక్షన్ 143(1) కింద ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుకు నోటీసు పంపుతుంది.

సెక్షన్ 143(1) అంటే ఏమిటి?

ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన తర్వాత, ఐటి డిపార్ట్‌మెంట్ దానిలో ఏదైనా లోపాలను గుర్తిస్తే డిపార్ట్‌మెంట్ పన్ను చెల్లింపుదారుకు సెక్షన్ 143(1) కింద ‘నోటీస్’ పంపుతుంది. ఈ నోటీసును రిటర్న్ దాఖలు చేసిన ఆర్థిక సంవత్సరం చివరి నుండి ఒక సంవత్సరం లోపు నోటీసులో వారు కోరిన వివరాలను పంపాలి.

ఆదాయపు పన్ను నోటీసు పన్ను చెల్లింపుదారు , రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి పంపుతాడు. అదే సమయంలో, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నీకు నోటీసులు పంపినట్లు SMS కూడా వస్తుంది.

ప్రధానంగా మూడు రకాల నోటీసులు వస్తాయి..

సెక్షన్ 143(1) కింద పన్ను చెల్లింపుదారులకు ప్రధానంగా మూడు రకాల నోటీసులు పంపుతారు. ఆదాయపు పన్ను రిటర్న్ సమయంలో అవసరమైన పత్రాలను పూరించకపోతే అప్పుడు మొదటి నోటీసు పంపుతారు. రెండవది పన్ను చెల్లింపుదారు అదనంగా ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే, అదనంగా చెల్లించిన మొత్తం మీకు తిరిగి ఇవ్వడానికి నోటీసు ఉండవచ్చు. మూడవ పరిస్థితి చెల్లించాల్సిన పన్ను కన్నా తక్కువ చెల్లిస్తే, పన్ను డిమాండ్ కోసం నోటీసు పంపుతారు.

నోటీసు రాగానే పన్ను చెల్లింపుదారు ఏం చేయాలి…

సెక్షన్ 143(1) కింద నోటీసు అందుకున్న తర్వాత, ముందుగా పన్ను చెల్లింపుదారు ఆ నోటీసులో తమ పేరు, పాన్, చిరునామా, ఇ-ఫైలింగ్ రసీదు సంఖ్య మొదలైన అవసరమైన వివరాలను తనిఖీ చేయాలి. అందులో తప్పులున్నాయని పన్ను చెల్లింపుదారు గుర్తిస్తే, ఈ విషయాన్ని మీరు ఐటీ శాఖకు తెలియజేయవచ్చు. ఇందుకోసం ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి రిటర్న్ ఫైల్‌ లో అప్‌డేట్ చేసుకోవచ్చు.

రిటర్న్‌ను దాఖలు చేయడంలో ఏదైనా పొరపాటు జరగనట్లయితే, పన్ను చెల్లింపుదారు డిపార్ట్‌మెంట్‌కు ఆ తప్పును సరిదిద్దడానికి దరఖాస్తును చేయవచ్చు. మీ దరఖాస్తును ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సమర్పించవచ్చు.