బ్రేకింగ్.. హాజీపూర్ శ్రీనివాసరెడ్డి ఘాతుకాలు నిజమే.. తేల్చేసిన కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. హాజీపూర్ శ్రీనివాసరెడ్డి ఘాతుకాలు నిజమే.. తేల్చేసిన కోర్టు

February 6, 2020

సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల అత్యాచారాల కేసులో తీర్పు వెలువడింది. నిందితుడు మర్రి శ్రీనివాస రెడ్డిని  కోర్టు దోషిగా నిర్ధారించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో జరిగిన మూడు హత్యాచారాల కేసులను విచారించిన పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. కోర్టు ఈ కేసులో 101 మంది సాక్ష్యాలను నమోదు చేసుకున్న కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. ముగ్గురు మైనర్లపై హత్యాచార కేసులో నేరం నిరూపితమైందని, ఏమైనా చెప్పుకునేది ఉందా? జడ్జి ప్రశ్నించగా, తాను నేరం చేయలేదని శ్రీనివాస రెడ్డి చెప్పారు.  తనపై కోపంతో తన  ఇల్లు కాల్చేశారని తన తల్లిదండ్రులకు దిక్కు లేకుండా పోయిందని అన్నాడు. భోజన విరామం తర్వత జడ్జి.. అతణ్ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పిచ్చారు. 

రెడ్డి బైక్‌పై లిఫ్ట్ ఇస్తాననే సాకుతో ముగ్గురు బాలికలను చెరపట్టి, చంపేసినట్లు పోలీసులు కేసు పెట్టారు. హాజిపూర్ గ్రామానికి చెందిన మనీషా, శ్రీవాణి, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పన శ్రీనివాసరెడ్డి చేతుల్లో బలైనట్లు అభియోగాలు మోపారు. గతేడాది జూలై 31న కోర్టులో చార్జిషీటు వేశారు. బాలికలను శ్రీనివాస రెడ్డే చంపేసినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో కూడా నిర్ధారణ అయింది. అతని సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌లు,  సీసీఫుటేజీలు కూడా నేరాన్ని నిర్ధారించాయి. దీంతో కోర్టు అతణ్ని దోషిగా నిర్ధారించింది. అయితే తాను అమాయకుడినని, పోలీసులు తనను ఈ కేసుల్లో ఇరికించారని శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడు. ఫోరెన్సిక్ నివేదికలు నిజమేనని, అయితే పోలీసులు తన రక్తాన్ని, వీర్యాన్ని బలవంతంగా తీసుకెళ్లారని అంటున్నాడు. శ్రీనివాసరెడ్డి ప్రవర్తన సరిగ్గా లేదని, అతడు జులాయిగా తిరిగేవాడని గ్రామస్తులు అంటున్నారు. హత్యాచారాల వెలుగు చూశాక అతని ఇంటిని వారు తగలబెట్టారు.