SBI బాటలోనే మరో 4 బ్యాంకులు.. పెరగనున్న ఈఎంఐలు - MicTv.in - Telugu News
mictv telugu

SBI బాటలోనే మరో 4 బ్యాంకులు.. పెరగనున్న ఈఎంఐలు

June 1, 2022

మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. బ్యాంకులు వరుసగా పెట్టి రుణ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. చాలా బ్యాంకులు ఇప్పుడు ఎస్‌బీఐ దారిలోనే నడుస్తున్నాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ , పీఎన్‌బీ బ్యాంక్ వంటివి కూడా రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీని వల్ల బ్యాంక్ నుంచి హోమ్ లోన్ వంటివి తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలని భావిస్తే.. అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సి వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాల కోసం రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (RPLR)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. నెల రోజుల్లో ఇది మూడోసారి పెంపు. గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. కస్టమర్ క్రెడిట్ స్కోర్ 780 కంటే ఎక్కువ ఉంటే అతనికి కనీస వడ్డీ రేటు 7.05 శాతంగా ఉంటుంది. ఇది అంతకు ముందు 7 శాతంగా ఉంది. కొత్త రేట్లు ఈరోజు నుండి అమలులోకి వచ్చాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రుణ రేట్లు పెంచేశాయి. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్‌ను 15 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ విషయానికి వస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.55 శాతంగా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఎల్ఆర్‌ను జూన్ 1 నుంచి పెంచేసింది. ఈ బ్యాంక్‌లో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.35 శాతంగా ఉంది. దీని వల్ల ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన లోన్ తీసుకున్న వారిపై ప్రభావం పడుతుంది.