చుట్టూ జనాలు..రోడ్డుపై పదుల సంఖ్య వాహనాలు..ఇంతలోనే ఓ యువతిని యువకుడు నడిరోడ్డుపై కొట్టుకుంటూ కారు ఎక్కించాడు.అయితే అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇదెక్కడో మారమూల ప్రాంతంలో జరగలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పబ్లిక్‌లో మహిళలపై దాడులు సర్వసాధరణమైపోయాయి. ప్రజలు కూడా మనకెందుకే అనే ఆలోచన ధోరణిలో ఉంటున్నారు. కళ్ళ ముందు ప్రాణాలు పోతున్న పట్టించుకోని పరిస్థితి. ఇదే ఢిల్లీ ఘటన ద్వారా కూడా మరోసారి రుజువైంది. ఢిల్లీలోని మంగోల్‍పురి ప్రాంతంలో ఓ అమ్మాయని ఓ వ్యక్తి నడిరోడ్డుపై తీవ్రంగా కొట్టి బలవంతంగా క్యాబ్‍లో ఎక్కిస్తున్న సమయంలో పబ్లిక్ అంతా ఓ సినిమాలా చూస్తున్నారే తప్పా ఎవరూ అడిగేందుకు ముందుకు రాలేదు.ఆ అమ్మాయిని ఆ యువకుడు పలుమార్లు తీవ్రంగా కొట్టి.. కారులో బలవంతంగా ఎక్కించాడు. అతడితో మరో యువకుడు కూడా కారులో ప్రయాణించాడు. ట్విట్టర్‌లో ఈ వీడియో వైరల్ అవడంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
#SOS | Just Now at Mangolpuri Flyover towards Peeragarhi Chowk.@DelhiPolice @LtGovDelhi @dcpouter @DCWDelhi @dtptraffic pic.twitter.com/ukmVc7Tu1v
— Office of Vishnu Joshi (@thevishnujoshi) March 18, 2023
ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు ఊబర్ క్యాబ్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. ముందుగా క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకుని విచారించారు. ఇద్దరు యువకులు, యువతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్యాబ్ బుక్ చేసుకున్నారనే అంశాలపై ఆరా తీశారు. రోహిణి నుంచి వికాస్‍పురి వరకు ఉబెర్ యాప్‍లో ఈ క్యాబ్‍ను వారు బుక్ చేసుకున్నట్టు విచారణలో తేలింది.ఆ ప్రయాణం మధ్యలోనే రోడ్డుపై గొడవపడ్డారు. ఆ యువకుల కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.