బాత్ రూంలో బంగారు బిస్కెట్లు పారేశాడు
పోలీసులకు ఎక్కడ చిక్కుతానో అనే అనుమానంతో ఓ ప్రయాణికుడు తనవెంట తెచ్చుకున్న బంగారం బిస్కెట్లను విమానం బాత్ రూంలో పారేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా బంగారాన్ని విమానం బాత్ రూంలో పారబోశానని చెప్పాడు. బాత్‌రూంలో ఉన్న 2.99 కిలోల బరువున్న 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి వస్తున్న షేక్ అబ్దుల్ సాజిద్ అనే ప్రయాణికుడు బంగారు బిస్కట్లను విమానంలో అక్రమంగా తరలిస్తున్నాడని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సాజిద్‌కి ఈ విషయం తెలిసి తన వద్ద వున్న ఆ బంగారాన్ని విమానంలోని మరుగుదొడ్డిలో పారేశాడు. అతని వద్ద తనిఖీలు చేసిన అధికారులకు ఎలాంటి బంగారం లభించలేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టాడు. దీంతో బాత్‌రూంలో ఉన్న 2.99 కిలోల బరువున్న 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ బంగారం బిస్కెట్ల విలువ రూ. 1.11 కోట్లు వుంటుందని అన్నారు.