ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నా: సుకుమార్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నా: సుకుమార్

May 18, 2022

సినీ ప్రియులకు డైరెక్టర్ సుకూమార్ అంటే తెలియని వారుండరు. ‘ఆర్య’ సినిమాతో దర్శకుడుగా తన కేరీర్ ప్రారంభించిన ఆయన..తాను సినిమాల్లోకి రావడానికి, ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి హీరో రాజశేఖర్ గారే కారణమని సంచలన విషయాన్ని బయటపెట్టారు. తాజాగా రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ సినిమాకు సంబంధించి మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకూమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

సుకూమార్ మాట్లాడుతూ.. “అప్పట్లో నేను రాజశేఖర్ గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయనను ఇమిటేట్ చేయడంతో మా ఊళ్లో నేను చాలా ఫేమస్ అయ్యాను. ఇది నిజం.. నేను ఈ స్టేజ్ మీద ఉన్నానని ఈ మాట చెప్పడం లేదు. నేను సినిమాలకి పనికి వస్తాననే విషయాన్ని నాకు పరోక్షంగా తెలిసేలా చేసింది రాజశేఖర్ గారే. ఆయన కూతుళ్లను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చి ఇండస్ట్రీ గౌరవాన్ని నిలబెట్టారు. ఈ సినిమా కోసం జీవిత గారు ఎంతగా కష్టపడ్డారనేది నాకు తెలుసు. ఒక వైపు ఫ్యామిలీ, మరోవైపు డైరెక్షన్, ప్రమోషన్స్ చూసుకోవడం మామూలు విషయం కాదు. నిజంగా ఆమెకి దణ్ణం పెట్టాలి. ఆమె కోసమైనా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు.

మొదట్లో సుకూమార్ ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పనిచేసి, 2004లో అల్లు అర్జున్ హీరోగా ‘ఆర్య’ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత ‘జగడం’, ‘ఆర్య 2’, ‘100% లవ్’, ‘నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుకూమార్ ఇండస్ట్రీకి రావడానికి పరోక్షంగా హీరో రాజశేఖర్ కారణమని చెప్పారు.