టాలీవుడ్లో గతకొన్ని రోజులుగా ఓ చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ తెలుగు సినీ పరిశ్రమకు ఎవరు పెద్ద దిక్కు? అనే విషయంపై హీరోల మధ్య ఎడతెరగని చర్చ నడుస్తోంది. కొంతమంది హీరోలు, జూనియర్ ఆర్టిస్టులు మెగస్టార్ చిరంజీవినే టాలీవుడ్ పెద్ద అని, మరికొందరు మోహన్ బాబే ఈ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని వాదోపవాదాలు చేసుకున్నారు.
ఈ విషయంపై చిరంజీవి పలుమార్లు మీడియాతో మాట్లాడుతూ..” నాకు ఏ పదవి వద్దు. నేను కేవలం సినిమా బిడ్డగా మాత్రమే ఉంటా. ఎవరికైనా ఆపద వస్తే, నావంతు సహాయం చేస్తా. అంతేగాని నేను ఇండస్ట్రీకి పెద్ద దిక్కును కాదు” అని ఆయన చెప్పారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఫిలిం జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..”ఈ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవే. ఫిలిం జర్నలిస్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది” అని క్లారిటీ ఇచ్చారు.
మరోపక్క ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల విషయంపై చిరంజీవి మొదటగా జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, దర్శకులు రాజమౌళి, కొరటాల శివతో కలిసి చిరంజీవి మరోసారి జగన్తో భేటీ అయ్యారు. అప్పటినుంచి ఇండస్ట్రీలో పలువురు ఈ ఇండస్ట్రీకి చిరంజీవే పెద్ద దిక్కు అని క్లారిటి ఇస్తూ, మాట్లాడారు. అయితే కొందరు కాదు అని, మరికొందరు అవునని చర్చలు జరుగుతుండడంతో శ్రీనివాస్ యాదవ్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు.