సిగరెట్లు మానేసి లక్షలు కూడబెట్టి.. మాజీ స్మోకర్ సక్సెస్ స్టోరీ  - MicTv.in - Telugu News
mictv telugu

సిగరెట్లు మానేసి లక్షలు కూడబెట్టి.. మాజీ స్మోకర్ సక్సెస్ స్టోరీ 

August 4, 2020

He quit smoking and amassed millions.. Former Smoker Success Story.

వద్దురా సోదరా పొగతాగి బతుకు నాశనం చేసుకోవద్దని ఎంత మొత్తుకున్నా ఎవరు వింటారు. సిగరెట్ల బాక్సుల మీద భయంకరమైన కపాలం గుర్తు ఉన్నా, అవి తాగితే క్యాన్సర్ వస్తుందని తెలిసినా పట్టించుకుంటారా? లేదు, తాగాలి.. మత్తులో ఈ ప్రపంచాన్ని మరిచిపోవాలి అనుకుంటారు. తాగితే క్రియేటివ్ ఆలోచనలు వస్తాయని కొందరు, తాగితే మైండ్ రిలాక్స్ అవుతుందని మరికొందరు.. ఇలా రకరకాల కారణాలు చెప్పి ధూమపానానికి బానిసలు అవుతున్నారు. ముదిరిన వ్యసనాన్ని మానుకోలేక ఎందరో పొగకు తమ ప్రాణాలు బలి ఇస్తున్నారు. ‘చెప్పంగ విననోడిని చెడంగా చూడాలి’ అని ఓ సామెత ఉంది. సిగరెట్ మానేసే విషయంలో.. వారికి తీవ్రమైన అనారోగ్యం వచ్చాకే చాలామంది రియలైజ్ అయి వాటి జోలికి వెళ్లడం లేదు. ఈ పెద్దాయన కూడా అంతే.. అనారోగ్యం తనదాకా వస్తేగానీ.. తన పట్టి పీడిస్తున్న సమ్మనైన సిగరెట్ మహమ్మారిని వదిలించుకోలేకపోయాడు. అలా సిగరెట్లు తాగడం మానేసి ఆ డబ్బులను పోగేశాడాయన. అలా పోగేసిన డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశాడు. చిత్రంగా ఉంది కదూ. కేరళలోని కోజికోడ్‌లో నివసించే ఆ పెద్దాయన పేరు వేణుగోపాలన్ నాయర్(75). వృత్తిరీత్యా భవన నిర్మాణ కార్మికుడు అయిన ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన 13వ ఏట నుంచే బీడీలు, సిగరెట్లకు బాగా అలవాటు పడ్డాడు. ఆ రోజుల్లో ముప్పావు అణాలకు మూడు సిగరెట్లు వచ్చేవి. నిత్యం ఠంచనుగా పెట్టెన్నర(20 సిగరెట్లు) తాగేవాడు. ‘తాగి తాగి సచ్చిపోతవా? ఆ పాడు సిగరెట్లు మానేయ్’ అని కుటుంబ సభ్యులు ఎంత పోరినా.. చివరికి డాక్టర్లు హెచ్చరించినా ఆయన పొగతాగడాన్ని విస్మరించలేదు. 

అలా డబ్బాలకు డబ్బాల పొగ తాగేస్తూ.. శరీరం మొత్తం పొగచూరిపోతూ, 67 ఏళ్ల వయసుకు వచ్చేశాడు.  ఓరోజు ఆయనకు ఆ పొగే పోటు పెట్టింది. 2012లో ఛాతీలో విపరీతమైన నొప్పి రాగా, ఆసుపత్రికి వెళ్లాడు. సిగరెట్లు మానేయకపోతే ప్రాణానికే ప్రమాదమని.. ఇక నుంచి ఒక్క సిగరెట్ తాగినా ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుందని చెప్పారు. కొన్ని మందులతో ఆయనకు చికిత్స చేశారు. అప్పటినుంచి ఆయనకు సిగరెట్ మీద వెగటు పుట్టింది.  ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒట్టు పెట్టుకున్నట్టు ఆయన ఒక్క సిగరెట్ కూడా ముట్టలేదు. ఆయన చివరిసారిగా సిగరెట్ తాగినప్పుడు ఒక పెట్టె ధర రూ.50 ఉంది. నిత్యం పెట్టెన్నర తాగడంతో 70 నుంచి 100 రూపాయలు ఖర్చు అయ్యేవి. సిగరెట్లు మానేసిన తర్వాత ఆ డబ్బును నిత్యం పోగు చేస్తూ వచ్చాడు. 8 ఏళ్లు తిరిగే సరికి రూ.5 లక్షలు పొదుపు చేశాడు. ఆ 5 లక్షల డబ్బుతో ఏదైనా మంచి పని చేయాలని తపించిన ఆయన.. తన ఇంటిపై మరో అంతస్తు నిర్మించాడు.  దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సిగరెట్లు మానేశాక తన జీవితం ఎంతో మారిపోయందని ఆయన తెలిపాడు. ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు ఆర్థికంగానూ లాభపడినట్లు చెప్పాడు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొన్నాడు. మార్పు చెందినవాడే మనిషి అని ఇందుకే అన్నారేమో కదా. ఇలా వేణుగోపాల్‌ను ఆదర్శంగా తీసుకుంటే ఎందరో మారిపోతారు కదూ.