అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదికతో వ్యాపారవేత్త అదానీ సామ్రాజ్యానికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయనతో సంబంధం ఉన్న వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ‘(దొంగ)లెక్కలు తేల్చాలని’ చర్చలకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం తమ దేశంతో ఉన్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని బంగ్లాదేశ్ కోరిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా అక్కడి ప్రధాన మీడియా తాజాగా ఓ వార్త వెలువరించింది. అందులో అదానీ.. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో పవర్ కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి ప్రధాన కారణం మన ప్రధాని మోడీ అని పేర్కొంది. ఈ డీల్ కంటే ముంద ప్రధాని ఆ దేశంలో పర్యటించారని , ఆ సమయంలోనే ఆ దేశంతో ఆదానీ పవర్ ప్లాంట్ గురించి చర్చించి ఉండొచ్చని తెలిపింది. మోదీ, అదానీల స్నేహబంధమే ఈ డీల్ కు ముందడగు వేసిందని, ఇదొక పెద్ద కుట్ర అని తెలిపింది.
2015లో అదానీ పవర్ ప్లాంట్‌తో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుదుర్చుకొన్న విద్యుత్తు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని బంగ్లా ప్రధాన పత్రిక ‘ది డైలీ స్టార్’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశీయ అవసరాలకు మించి ఎక్కువ విద్యుదుత్పత్తి ఉన్నప్పటికీ, బయటి దేశంలోని (భారత్) ఓ ప్రైవేట్ కంపెనీతో ఎక్కువ ధరకు డీల్‌ను కుదుర్చుకోవడమేంటని ప్రశ్నించింది. ఈ ఒప్పందం దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నదని తూర్పారబట్టింది. ఈ ఒప్పందంపై సమీక్ష జరుపాలంటూ ఆయా రంగ నిపుణులను కోరింది. వాళ్లు కూడా ఈ డీల్ అక్రమమేనని తేల్చడం గమనార్హం.
కాగా, ఈ ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు (బీపీడీబీ) అప్పటి సెక్రటరీ మీనా బసూద్ ఉజ్జామన్‌ను ది డైలీ స్టార్ సంప్రదించింది. ఈ డీల్‌కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. డీల్ గురించి తనకేమీ గుర్తులేదని, చైర్మన్ ద్వారానే ఆదేశాలు వచ్చాయని, తాను సంతకం చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. డీల్‌పై అప్పటి బీపీడీబీ చైర్మన్ ఖలీద్ మహమూద్‌ను ది డైలీ స్టార్ సంప్రదించగా.. ఈ డీల్ గురించి మాట్లాడే ఆసక్తి తనకు లేదని పేర్కొనడం గమనార్హం.