లవంగాలు.. ఆరోగ్యానికి రక్షణ కవచాలు..
మటన్, చికెన్ లేదా బిర్యానీ చేసినప్పుడు వాటిలో లవంగాలు వేస్తే రుచే ప్రత్యేకమైంది. ఘాటుగా వుంటూ తన ప్రత్యేక రుచితో అలరిస్తుంది. ఒక ప్రత్యేకమైన సుగంధద్రవ్యంగా దీనిని అన్నిరకాల వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. వీటిని కూరలలోనే కాకుండా కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి కొందరు అదేపనిగా దీనిని దవడకు వేసుకుని నముల్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటిబయోటిక్ గుణాలు ఉన్నాయి. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ కె, కాలరీలు, పిండిపదార్థాలు, ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి.
లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం లవంగాలలో ఉంది. ఇది ఒక చెట్టు మొగ్గ. దీనిని ఎండబెడితే లవంగం అవుతుంది. ఇండోనేషియాలోని స్పైస్ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్ దీవుల్లో ఇవి పుట్టాయి. ప్రస్తుతం వీటిని బాంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, వెస్టిండీస్, మారిషస్, జాంజిబార్, శ్రీలంక, పాకిస్తాన్, పెంబా తదితర దేశాల్లోనూ పండిస్తున్నారు.
లవంగాలతో లాభాలేంటో చూద్దాం..
కొంతమందికి ప్రయాణాల్లో వామ్టింగ్ వస్తుంది. అలాంటివారు ఓ రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే చాలు. ఆహారం జీర్ణం అవుతుంది. వికారం పోతుంది. లవంగాలు క్యాన్సర్ అంతు చూడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా లవంగాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది. బరువు తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి. లవంగాల్లో ఉండే యాంటీవైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సాధారణంగా వచ్చే జలుబు దగ్గును నివారిస్తుంది. లవంగాలు ఉడికించిన నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
మన శరీర ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలు తినాలి. వాటిలోని మాంగనీసు మన ఎముకలకు అవసరం అవుతుంది. ఎముకలు బలంగా ఉండేందుకు లవంగాల్లోని యూజెనాల్ నూనె చక్కగా పనిచేస్తుంది. నెలతప్పిన మహిళలు మొదటి మూడునెలలు వాంతులు, వికారం సమస్యలను ఎదుర్కొంటారు. వాటితో పాటు నీరసం కూడా బాధిస్తుంటుంది. వీటిని నివారించాలంటే లవంగాలు తింటే మంచి ఫలితం వుంటుంది. లవంగాలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, ఆపాన వాయువు వంటి సమస్యలను లవంగాలతో నివారించవచ్చు.
లవంగాల్లో గ్లూకోజ్‌ను తగ్గించే గుణాలు వున్నట్లు కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి. మధుమేహం ఉన్నవారు లవంగాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మధుమేహంతో బాధపడేవారు వీటిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. లవంగాలు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. కండరాలూ, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తాయి
కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి. తెల్ల రక్తకణాలను పెంచడంలో లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి. చర్మ సమస్యలకు లవంగాలు మంచి మందులా పనిచేస్తాయి. లవంగాలను చందనంతో కలిపి మెత్గగా నూరి, ఆ పేస్టును ఇన్ఫెక్షన్, దురద లేదా ఇతర చర్మ సమస్యలున్న ప్రదేశంలో రాస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గుతాయి.
లవంగాలతో నష్టాలు..
లవంగాలు ఆరోగ్యానికి మంచివి కదా అని ఎక్కువగా వాడేయకూడదు. ఇవి ఎంత మేలు చేస్తాయో.. మోతాదు మించితే కీడు చేస్తాయి కూడా. అందువల్ల కొద్దికొద్దిగా మాత్రమే వీటిని వాడటం మేలు. పిల్లలకు లవంగం నూనె అంతమంచిది కాదు. అందువల్ల వాళ్లకు వీలైనంత వరకు లవంగాలు ఇవ్వకూడదు. లవంగాలను అదే పనిగా నోట్లో పెట్టుకుంటే నోరు పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. రోజుకు నాలుగైదు మించకుండా చూసుకోవాలి.