పూర్వం అందరూ నేల మీద కూర్చుని భోజనం చేసేవారు. సరదాగా కబుర్లు చెప్పుకుని భోజనం చేయడం అలవాటుగా ఉండేది. కాలం మారింది. దాంతో పాటూ పద్ధతులూ మారాయి. డైనింగ్ టేబుల్స్ వాడుకలోకి వచ్చాయి, అలవాటు అయ్యాయి. కానీ పూర్వకాలంలో మహారాజులు కూడా కింద కూర్చునే భోజనం చేసేవారు.ఇప్పటికీ.. గ్రామాల్లో చాలా మంది కింద కూర్చునే భోజనం చేస్తారు. నేల మీద కూర్చుని భోజనం చేస్తే.. సౌకర్యంగానే కాదు, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ:
నేలమీద కూర్చుని భోజనం చేస్తే.. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేలపై కూర్చుని తినేటప్పుడు ముందుకు వంగుతాము మళ్ళీ లేస్తాము. దీని వల్ల జీర్ణ రసాలు బాగా విడుదల అవుతాయి. ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడంలో కీలకపాత్ర వహిస్తాయి. దానివల్ల శరీరానికి కావలసినంత శక్తి అందుతుంది. మనం భోజనం చేయడానికి నేల మీద కాళ్ళు మడిచి కూర్చున్నప్పుడు మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తుంది.
పోస్చర్:
మనం భోజనం చేసేప్పుడు సరైన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం. మనం తినేప్పుడు సరైన పోస్చర్‌లో కూర్చుంటే మన కండరాలు, కీళ్ళు, మోకాలు, వీపు, మెడ, చేతులపై అధిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నేల మీద కూర్చున్నప్పుడు మన భంగిమ ఆటోమెటిక్‌గా సరవుతుంది. మన వీపును నిటారుగా చేస్తుంది, వెన్నముకను నిటారుగా ఉంచుతుంది, మన భుజాన్ని వెనక్కు నెట్టుతుంది. దీనివల్ల మన పోస్చర్ సరి అవుతుంది.
వెయిట్ లాస్:
నేల మీద కూర్చుని తింటే.. మన బరువు కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది డైనింగ్ టేబుల్ పైన కూర్చుని ఎంత తిన్నామో తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. దీనివల్ల బరువు పెరుగుతారు. మనకు సరిపోయేంత తిన్నామా? లేదా? అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్‌ను అందించే ఒక నాడి ఉంటుంది.కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి సమర్థంగా పనిచేస్తుంది. దీంతో మనం సరిపడా.. ఆహారం మాత్రమే తింటాం.. అలా బరువు ఎప్పుడూ కంట్రోల్ ఉంటుంది.
ఆసనం:
నేలపై సుఖాసనంలో కూర్చుని భోజనం చేస్తే.. ఫోకస్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ఆటోమెటిక్‌గా.. మనం చేసే పని మీద శ్రద్ధ చూపేలా చేస్తుంది. మనస్సు నుంచి ఒత్తిడి తగ్గిస్తుంది. సుఖాసనంలో కూర్చుని భోజనం చేస్తే.. శరీరంలో ఆక్సిజన్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జీవిత కాలం పెరుగుతుంది..
నేలమీద కూర్చుని తింటే.. మన జీవితకాలన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. సుఖాసనంపై కూర్చుని ఏ సపోర్ట్ లేకుండా పైకి లేవగలిగే వ్యక్తులు ఎక్కువకాలం జీవిస్తారు. సుఖాసనం నుంచి లేవడానికి బలం, స్టామినా అవసరం.
రక్తప్రసరణ:
మనం సుఖాసనంలో కూర్చున్నప్పుడు.. పాదలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అదనపు రక్తాన్ని గుండె ద్వారా ఇతర అవయవాలకు ప్రసారం చేయడం ప్రారంభిస్తుంది. ఇది జీర్ణక్రియకు అవసరమైన కార్యాచరణను పెంచుతుంది. అలాగే టెన్షన్‌ని దూరం చేసి ఏకాగ్రతతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.