మెంతులు చేసే మేలు ఇంతింత కాదయా.. – MicTv.in – Telugu News
mictv telugu

మెంతులు చేసే మేలు ఇంతింత కాదయా..

August 13, 2019

Health benefits with fenugreek.

పోపుల పెట్టె ఔషధాల తుట్టె. చిన్నిచిన్న ఆరోగ్యం సమస్యలకు అది పెద్ద డాక్టర్. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే అందులోని దినుసుల్లో మెంతులు గురించి చెప్పకుందాం. చేదుగా వున్నప్పటికీ ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ తినే ఆహారంలో మెంతులను ఏదో ఒకరూపంలో వాడటంతో ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. ఊరగాయకు తనదైన రుచితో మెప్పిస్తాయి మెంతులు. మెంతి ఆకులను కూడా మనం తరచూ కూరగాయల్లో వాడుతుంటాం. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ఇంగ్లీషులో ఫెనుగ్రీక్ గింజలు అంటారు.  ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. 

మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. అతి తక్కువ కేలరీలు కలిగివుంటుంది. మెంతులలో కార్బోహైడ్రేట్లు తక్కువ. ఫలితంగా మీకు అధిక బరువు చేరదు. బరువు తగ్గాలంటే మీరు కేలరీలు తగ్గించాలి. 

మెంతులతో లాభాలు..

  • జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.
  • బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతాయి. బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. రసధాతువు మీద మెంతుల్లోని పోషకాంశాలు పని చేయటం వల్ల తల్లిపాల తయారీకి ఇది సహాయపడుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం మంచిది.
  • గర్భిణులకు బిడ్డపుట్టే ప్రక్రియను సులభతరం చేస్తుంది. మహిళల్లో యుటేరియన్ కాంట్రాక్షన్ స్టిములేట్ కాన్పును సులభతరం చేస్తాయి. వీటికి ప్రసవ నొప్పులను తగ్గించే శక్తి వుంది. అయితే గర్భధారణ సమయంలో మితంగా తీసుకోవాలి.
  • మెంతుల్లో డే సపోనిన్స్‌లో ఫైటోఈస్ట్రోజన్స్ తయారీకి అవసరమైన ప్రికర్సార్లు – డోయోస్‌జెనిన్స్ వుంటాయి. ఇవి మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రసవం తరువాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయంలో చెడు రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. 
  • మెంతులను కొలెస్టరాల్‌ని తగ్గించుకోవడానికి ఔషధంగా వాడుకోవచ్చు. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లకు లేదా వెన్న తీసిన మజ్జిగకు కలిపి తీసుకుంటూ ఉంటే ప్రమాదకరమైన లోడెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్) తగ్గినట్లుగా అధ్యయనాల్లో తేలింది.
  • వెయిట్ లాస్ డైట్‌లో మెంతులను చేర్చుకోవడం వల్ల ఆకలిని అరికడుతుంది. ఉదయం పరగడపును నానబెట్టిన మెంతులు తింటే , కడుపు నిండుగా ఉన్న భావన కలిగి ఆకలి కంట్రోల్ చేస్తుంది.
  • మధుమేహం మీద పని చేస్తాయి. మధుమేహ నియంత్రణ కోసం మెంతులను రోజుకి 50 గ్రాములను, రెండు మూడు డోసులుగా విభజించి తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మధుమేహ నియంత్రణ శక్తిని వినియోగించుకోవచ్చు. ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది. 
  • మలబద్దకం వున్నవారు 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది. 
  • జీర్ణక్రియలో ఆలస్యం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపు తదితర సమస్యలతో కూడిన అజీర్ణాన్ని మెంతులు తగ్గిస్తాయి. 
  • నీళ్ల విరేచనాలను, అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తాయి. మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో తయారైన అల్సర్లని తగ్గించడంతో పాటు మలం విచ్చుకుని తయారయ్యేలా చేస్తుంది. అందుకే ఇది సౌమ్యమైన విరేచనకారిగా పని చేస్తుంది.
  • కాలేయ ఆరోగ్యానికి మెంతుల్లోని చేదు తత్వాలు బాగా పనిచేస్తాయి. 
  • మెంతులను తేనె మరియు నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. గొంతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
  • మెంతుల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ శరీరంలోని టాక్సిన్స్‌ను తగ్గిస్తుంది. కోలెన్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. 
  • మెంతి పేస్టులో ముంచిన ఒక శుభ్రమైన వస్త్రంను చర్మం ఇన్ఫెక్షన్స్ అయిన ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది స్కిన్ బర్న్, బొబ్బలు, తామర వంటి వాటి నుంచి చర్మానికి రక్షణ కలిగిస్తుంది.
  • మెంతి ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడం తగ్గుతుంది. వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. 
  • తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ తగ్గిపోతాయి.
  • ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
  • మెంతులను పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తర్వాత పౌడర్‌గా చేసుకుని చల్లబడిన తర్వాత తినవచ్చు. గాలి చొరని డబ్బాలో ఈ మెంతి పొడి వుంచాలి. పెరుగుతో కలిపి తినవచ్చు.

మెంతులతో దుష్ప్రయోజనాలు..

మెంతులతో ఆరోగ్యానికి లాభం ఎంతుందో కొన్ని నష్టాలు కూడా వున్నాయి. మెంతులను గర్భిణీ స్త్రీలు తినడం అంత మంచిది కాదు. దాని వల్ల ముందుగానే కాన్పు అయ్యే ప్రమాదం ఉంది. కాన్పుకి ముందు మెంతులు తింటే శిశువు నుండి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.

మధుమేహానికి వాడే వారు డాక్టర్ సలహాతో మెంతులను తీసుకోవడం మంచిది.

కొంతమందికి మెంతుల ఎలర్జీ ఉంటుంది. వారు మెంతులను తీసుకోకపోవడమే మంచిది.