మనలో చాలామంది కారం ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. చప్పగా ఉంటే ముద్ద దిగదని…మరింత స్పైసీ కావాలని కోరుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే కారం ఎక్కువగా తింటే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కారం తింటే అనేక వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. పచ్చిమిర్చి కావచ్చు…ఎర్ర మిర్చి కావచ్చు..ఏదైనా సరే మోతాదుకు మించి వాడకూడదని చెబుతున్నారు. కారం ఎక్కువగా తింటే ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసుకుందాం.
1. పైల్స్ రావచ్చు :
అవును మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఇది పొట్టలో నిరంతర వేడి కారణంగా వచ్చే సమస్య. కడుపులో అధిక వేడితో మలం పొడిగా మారుతుంది. ఇది పైల్స్‌కు కారణమవుతుంది. అందుకే కారంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.
2. అల్సర్లు:
కారం ఎక్కువగా తినడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడతాయి. నిజానికి కారం పరిమితికి మించి తినడం వల్ల మీ పొట్టలోని పొరను పాడుచేసి, ఎసిడిటీకి కారణం అవుతుంది. ఇది గ్యాస్, అజీర్ణానికి దారితీస్తుంది. అంతేకాదు కడుపులో అల్సర్లకు కారణమవుతుంది.
3. చర్మంపై వాపు:
కారం ఎక్కువగా తినడం వల్ల ముఖంలో వాపు, మంట కలిగిస్తుంది. ముఖంలో దురదతో పాటు చికాకును కలిగిస్తుంది. అంతేకాదు మీ చర్మాన్ని ఎర్రగా మారుస్తుంది.
రోజులో కారం ఎంత తినాలి?
ఒక రోజులో 1 టీస్పూన్ కంటే ఎక్కువ కారం తినకూడదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఇది కాకుండా, ఒక రోజులో 2 లేదా 3 కంటే ఎక్కువ పచ్చి మిరపకాయలు తినకూడదట. కారం ఎక్కువగా తింటే నెమ్మదిగా పొట్టసంబంధిత వ్యాధులతోపాటు మరెన్నో సమస్యలకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.