50 వేల వెంటిలేటర్లకు కేంద్రం ఆర్డర్.. పీఎం కేర్స్ నిధులతో.. - MicTv.in - Telugu News
mictv telugu

50 వేల వెంటిలేటర్లకు కేంద్రం ఆర్డర్.. పీఎం కేర్స్ నిధులతో..

August 4, 2020

Health Min says 50,000 ventilators ordered from PM Cares, ICMR adds social distancing best vaccine so far.

కరోనాపై పోరులో వచ్చిన పీఎం కేర్స్‌ నిధులతో 50 వేల వెంటిలేటర్లను ఆర్డర్‌ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. మొత్తం 60వేల వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇవ్వగా.. వాటిలో 96 శాతం వెంటిలేటర్లు మేకిన్‌ ఇండియాలో భాగమేనని ఆయన అన్నారు. కరోనాను అంతమొందించే దిశలో కీలకమైన ఐసీయూ వెంటిలేటర్ల ఉత్పత్తి విషయంలో మేకిన్‌ ఇండియాకు పెద్దపీట వేసినట్లు ఆయన స్పష్టంచేశారు. 

ఈ విషయమై రాజేశ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం 60వేల వెంటిలేటర్లకు ఆర్డర్‌ చేసింది. వీటి తయారీలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), ఆంధ్రా మెడ్‌టెక్‌ జోన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం 50వేల వెంటిలేటర్ల కొనుగోలుకు రూ.2 వేల కోట్లు పీఎం కేర్స్‌ నుంచి ఖర్చుచేశాం. ఇప్పటికే 18 వేల వెంటిలేటర్లు రాష్ట్రాలకు చేరుకున్నాయి. కరోనాకు ముందు దేశంలో వెంటిలేటర్ల తయారీ పరిశ్రమ అంతంతగానే ఉంది. అలాంటిది ఇప్పుడు మన దేశం ఓ భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. దేశంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో 0.27 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ సపోర్ట్‌ అవసరం ఉంటుంది’ అని ఆయన తెలిపారు. కాగా, భారత్‌లో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు కోట్లమందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. దేశ వ్యాప్తంగా 18 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.