జీలకర్ర.. రుచికీ, ఆరోగ్యానికీ ఊతకర్ర..   - MicTv.in - Telugu News
mictv telugu

జీలకర్ర.. రుచికీ, ఆరోగ్యానికీ ఊతకర్ర..  

December 2, 2019

Health Profit with cumin seeds 

పప్పుచారును అన్నంలో కలుపుకుని ముద్దలు తినేటప్పుడు పంటికింద జీలకర్ర వస్తే ఆహా ఆ రుచిని ఆస్వాదించనివారు, ఆవురావుమంటూ తిననివారు ఎవరుంటారు చెప్పండి. చేపల పులుసులో, పచ్చిపులుసులో, ముద్దపప్పు, సాంబారు, కూరగాయలు, బగారా రైస్‌, జీర రైస్‌, చికెన్ అచార్, టమోటా చట్నీ, గోంగూర పచ్చడి, మామిడి ఊరగాయ, ఉప్మా.., ఇలా ప్రతీ వంటకంలో జీలకర్రను వాడుతాం. సుగంధ ద్రవ్యాల రుచిలో తన ప్రత్యేకతను చాటుకుని పోపుల పెట్టెకే రారాజు అయింది జీలకర్ర. సోంపు, శాజీర ఆకారంలో ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఇది శరీరానికి చలువ చేస్తుంది. దీనిని మనం నిత్యం వంటకాలలో వాడుతుంటాం. దీని శాస్త్రీయ నామం cuminuma cyminum. ఇది సుమారు 30-50 సెంటిమీటర్లు పెరిగే మొక్క. దీని గింజలు గోధుమ రంగులో చిన్నగా ఉంటాయి. ఇవి నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర రెండు రకాలుగా లభిస్తాయి. జీలకర్ర నూనెను కాప్సూల్ లేదా ఔషదాల తయారీలలో కూడా వాడతారు.

ప్రాచీన కాలం నుంచి ఇది వాడుకలో ఉంది. మొదటిలో ఇది ఇరాన్‌ ప్రాంతంలో విరివిగా ఉండేదని బైబిల్‌లో ఉందని చెప్పుకుంటారు. గ్రీకులు, రోమన్ల వాడుకలో ఉందని అంటారు. హిందూ వివాహంలో జీలకర్ర బెల్లం తలపై పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టం. ఈమధ్య జీరా సోడా విరివిగా అమ్ముడుపోతోంది. కూల్‌డ్రింకులు తాగడం కన్నా జీరాసోడా తాగితే శరీరానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. నల్ల మిరియాలు తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో జీలకర్ర ప్రసిద్ధిచెందిన మసాలా దినుసుగా పేరు గడించింది. వీటికి ప్రత్యేకమైన సువాసన ఉండటంతో.. నేపాల్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక మెక్సికో మొదలైన దేశాలలో విరివిగా వాడుకలో ఉంది. జీలకర్రను పొడిగా గానీ లేదా మొత్తం గింజలుగా ఉపయోగిస్తారు. ఇవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. 

 

జీలకర్రతో లాభాలు.. 

 

-జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారకాలను కలిగి ఉండటంతో జలుబు మరియు ఫ్లూలను కలుగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర విత్తనాలు, అల్లం, తేనె, తులసి ఆకులను కలుపుకుని తాగటం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

 

– రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్స్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మురికిని, ఫ్రీ-రాడికల్స్‌ను తొలగించి, వ్యాధులను తట్టుకునే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

 

ఇందులో ఫైబర్, యాంటీ-ఫంగల్, లాక్సైటీవ్స్, కార్మినేటివ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనిని మొలలకు చికిత్సగా వాడతారు.

 

శరీరంలో ఐరన్ తగ్గటం వల్ల అనీమియా వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా పిల్లలలో, ఆడవాళ్ళలో, యక్తవయస్సు వాళ్ళలో ఉంటుంది. రక్తంలో హీమోగ్లోబిన్ తయారు అవటానికి కావలసిన ఐరన్ జీలకర్రలో విరివిగా లభిస్తుంది.

 

-ఆలివ్ ఆయిల్, జీలకర్ర నూనె సమంగా కలిపి జుట్టుకి రాయటం వల్ల వెంట్రుకలు పెరుగుతాయి. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.

 

-జీలకర్రతో కాలేయంలో పైత్యరసం ఉత్పత్తి అవుతుంది. పైత్యరసం కొవ్వును విచిన్నం చేయటంలో, పోషకాలను గ్రహించటంలో సహాయపడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. జీలకర్ర కడుపు నొప్పి, విరోచనాలు, వికారము, ఉదయపు అలసటను, అజీర్ణం వంటి వాటిని తగ్గిస్తుంది.

 

-ఇందులో విటమిన్ ‘ఇ’ సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగానూ, ప్రకాశవంతంగాను చేస్తుంది. జీలకర్రలో ముఖ్యమైన నూనె ఉండటంతో  శుద్ధికారిగా పనిచేస్తుంది. యాంటీ-ఫంగల్ గుణాన్ని కాలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఫంగల్ మరియు మైక్రోబియల్ అంటువ్యాధుల బారి నుంచి సంరక్షిస్తుంది. జీలకర్ర లేహ్యన్ని మొహానికి పూసుకోవటం వల్ల మొటిమలు, గజ్జి, సోరయాసిస్ వంటి చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. యాంటీ-ఏజింగ్‌గా పనిచేసి చర్మంపై ముడతలు రాకుండా‌ చేస్తుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఫ్రీ-రాడికల్స్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

 

-జీలకర్రలో తైమోక్వినోన్‌ పదార్థం ఉంటుంది. అస్తమాకు కారణమయ్యే వ్యాధుల కారకాలను ఇది తగ్గిస్తుంది. అంతే కాకుండా బ్రాంకో-డైలేటర్‌గా పనిచేస్తుంది. 

 

-మహిళల నెలసరిని క్రమంగా వచ్చేలా చేస్తుంది. నెలసరిలో ఇబ్బందులను తగ్గిస్తుంది. ఇది అధికంగా యాంటీ-ఆక్సిడెంట్ గుణాలని కలిగి ఉండటం వల్ల రుతుక్రమ సమయంలో ఇబ్బందులను తట్టుకునేలా శరీరాన్ని తయారుచేస్తుంది. 

 

-జీలకర్రను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. 

 

-ఎసిడిటీని తగ్గించే గుణం జీలకర్రలో పుష్కలంగా ఉంది. 

 

-జీలకర్రను రోజూవారి ఆహారంలో తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా కాపాడుతుంది.