వానాకాలం.. ఏవి తినాలి? ఏవి తినొద్దు! - MicTv.in - Telugu News
mictv telugu

వానాకాలం.. ఏవి తినాలి? ఏవి తినొద్దు!

August 8, 2019

Healthy Foods To Eat During Monsoon

కాలానికి తగ్గట్టు మసలుకోవాలి.. లేదంటే మరిన్ని అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. చలి, ఎండాకాలం తర్వాత వానాకాలం వచ్చేస్తుంది. ఈ కాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి శ్రద్ధ వహించాలి. వాతావరణం ఒకేసారి చల్లగా మారిపోవడం, వానల్లో తడిసి జలుబు, పడిశం వస్తుంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది కాబట్టి అందుకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాల్సి వుంటుంది. వానాకాలంలో తప్పకుండా ఆహార నియమాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో చూద్దాం..

  • గోరువెచ్చని సూపులు, పానీయాలు తాగడం శ్రేయస్కరం. తరచూ అవి తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అల్లం, లెమన్, గ్రీన్ టీలను తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు.
  • ఈ కాలంలో వేపుళ్ళ కంటే ఆవిరి మీద వండినవి తింటే మంచిది. మాంసాహారులు ఈ కాలంలో తక్కువ తింటేనే మంచిది. తిన్నా మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. వేపుడు వంటకాల కంటే గ్రిల్డ్ లేదా ఉడికించిన మాంసాహార వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • సీజన్‌లో కూరగాయలు, ఆకుకూరలపై బ్యాక్టీరియా, ఇతర క్రిములు ఉండే ప్రమాదం ఎక్కువ గనుక వాటిని నేరుగా తీసుకోవద్దు. తప్పకుండా ఉప్పునీళ్లలో బాగా కడిగి ఉడికించి మాత్రమే తినాలి.
  • ఎండ వుండదు గనుక ఈ కాలంలో దాహం వేయదు. దాహం వేయదు కాబట్టి నీళ్లు తాగకుండా వుండకూడదు. నీళ్లు తక్కువగా తాగడం వల్ల జీర్ణశక్తి మందగించడంతో పాటు పలు సమస్యలు రావచ్చు. కనుక తగినంత కాచి చల్లార్చిన నీరు తాగుతుండాలి. రోజుకోసారి పండ్ల రసాలు, తాజా కూరగాయల రసాలు తాగితే ఒంట్లోని నీటి నిల్వలు స్థిరంగా ఉంటాయి.
  • రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మ, నారింజ, బత్తాయి, జామ, దానిమ్మ వంటి విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు తినాలి. అలాగే కాప్సికమ్, బెర్రీస్, గుమ్మడి వంటి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

 

వానాకాలం చేయకూడని పనులు..

Image result for street food india in monsoon

  • వాతావరణం చల్లబడగానే మనసు వేడివేడి చిరు తిళ్ళమీదికి మళ్లుతుంది. నూనెలో వేయించిన మిరప బజ్జీలు, పకోడీలు, సమోసాలు తినాలని జిహ్వ కోరుకుంటుంది. రోడ్డు వెంట వుండే ఫాస్ట్ ఫుడ్స్ తినాలని చూస్తారు. వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ఎందుకంటే వానాకాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. అందుకని అలాంటివి తినకుండా వుండాలి. తింటే ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
  • జల కాలుష్యం పొంచి ఉండే ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ నీరు తాగకూడదు. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే పానీపూరి అస్సలు తినవద్దు.
  • ఈ రోజుల్లో బయట సలాడ్స్‌ తినరాదు.. వాటిమీద క్రిములు వుంటాయి. ఎప్పుడో కోసిపెట్టిన ఈ పండ్లు, కూరగాయల ముక్కల్లో తేమ చేరి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే సలాడ్స్ తినాలనుకొంటే తాజాగా చేసుకొని తినాలి.
  • వర్షాకాలంలో ఆహారం మెల్లగా జీర్ణం అవుతుంది. అందుకని నూడిల్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్స్ తగ్గించాలి.
  • శ్వాసకోశ సమస్యలు, మైగ్రేన్‌, సైనసైటిస్ బాధితులు ఈ రోజుల్లో చల్లని పెరుగు, ఐస్‌క్రీమ్స్‌లకు దూరంగా ఉండాలి. పాలు తాగేవారు  గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగాలి.

 

వర్షాకాలం మహిళలు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు..

వానాకాలంలో మహిళలు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు. వర్షాకాలంలో అజీర్ణవ్యాధి కలిగేటంత ఆహారం తీసుకోకూడదు. ఆకుకూరలు, వర్షాకాలంతో తినకపోతే మంచిది. కాయలు పులుసు సాంబార్, చట్నీలను తరుచు తీసుకోవాలి. 

Image result for women eating palak in india

పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్లితో చేసిన పదార్థాలు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవి రక్తాన్ని శుద్ధి పరుస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఆకలిపెరుగుతుంది. 

ఆకుకూరలలో నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. వర్షాకాలంలో ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. 

పులుపు పదార్థాలు పెరుగు, మజ్జిగలాంటివి పూర్తిగా తగ్గించాలి. ఇవి కడుపులో ఆమ్ల మోతాదును పెంచుతాయి. వేడిచేసి చల్లార్చిన నీరుతాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.