87ఏళ్ల వయసులో ఎంత కష్టం.. బతికే ఉన్నానని రోజూ కాగితం అంటిస్తోంది.. - MicTv.in - Telugu News
mictv telugu

87ఏళ్ల వయసులో ఎంత కష్టం.. బతికే ఉన్నానని రోజూ కాగితం అంటిస్తోంది..

October 14, 2018

వృద్ధాప్యం మన దేశంలో శాపంలా మారిపోయింది. రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోయాక తల్లిదండ్రులు దీనంగా గడిపేస్తున్నారు. ఇక పిల్లలు లేని, ఉన్నా దూరమైన ముసలివాళ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. చివరికి మాట్లాడే తోడు లేక, ఆదుకునే హస్తం లేక కోట్లు మంది జీవచ్ఛవాలుగా మిగిలిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా జాలాదీ గ్రామంలో నివసిస్తున్న 87 ఏళ్ల కౌసల్యాదేవిది అంతకు మించిన వ్యథ, కష్టం. ఆమె మనదేశంలో అత్యంత ఒంటరి మహిళ. ఆమె తాను బతికే ఉన్నానని రోజూ కిటికీకి కాగితం అంటిస్తోందంటే ఎంత వేదన అనుభవిస్తోందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. రోజూ కాగితం అంటిస్తేనే ఆమె మనుగడ సాధ్యం.

trt

ఎందుకు?

కౌసల్య రోజూ పొద్దుగూకగానే తెల్లకాగితం ముక్కను కిటికీకి అతికిస్తుంది. పొద్దున లేవగానే దాన్ని పీకేస్తుంది. పీకకుండా అలాగే ఉంచితే ఆమెకు ఏదో కష్టం వచ్చినట్లు గుర్తు. గోడకు పగటిపూట కాగితం అలాగే ఉంటే గ్రామస్తులు వచ్చి ఆమెను విచారించి, సాయం చేసి వెళ్లిపోతారు. గతంలో ఒక రోజు ఆమె అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. నాలుగైదు రోజులు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా కాగితం పద్ధతి అనుసరిస్తోంది. ఎందుకంటే ఆమె ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది కనుక. ఇంట్లో ఆమె మాత్రమే ఉంటుంది కనుక. కౌసల్యకు భర్త లేదు. కొడుకు దేశాటనం వెళ్లాడు. అతని కోసం ఆమె ముసలి తల్లి ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. కౌసల్య జబ్బు పడితే గ్రామస్తులు ఆ విషయాన్ని చంబాలోని ఆమె కుమార్తెకు చెబుతారు. ఆమె వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్తుంది. ఇటీవల సంజయ్ శర్మ అనే సామాజిక కార్యకర్త ఈ కాగితం కౌసల్య దీనగాథను సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఆమె గురించి దేశానికి తెలిసింది. ఆమె జీవితంపై ప్రస్తుతం ఓ షార్ట్ ఫిలిమ్ రూపొందుతోంది.