మలక్‌పేట్ టూ పంజాగుట్ట, గుండె కోసం గ్రీన్ ఛానల్  - MicTv.in - Telugu News
mictv telugu

మలక్‌పేట్ టూ పంజాగుట్ట, గుండె కోసం గ్రీన్ ఛానల్ 

September 15, 2021

Heart Transplantation for Painter

‘‘ మరణించినా జీవించండి ’’ అనే నినాదంతో పురుడు పోసుకున్న అవయవదానం సరికొత్త మానవీయ ఉద్యమానికి నాంది పలికింది. ఎన్నోజీవితాల్లో వెలుగులు నింపింది, ఎన్నో ప్రాణాలకు ఊపిరి పోసింది. అలాంటి సంఘటనే నిమ్స్ ఆసుపత్రిలో జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ గుండెను మరో పేషంట్‌కు శస్త్రచికిత్స ద్వారా అమర్చనున్నారు.

సెప్టెంబర్ 12వ తేదిన గొల్లగూడెం వద్ద ఖమ్మం జిల్లాకు చెందిన వీరబాబు రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపుతప్పి వీరబాబు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన వీరబాబు మలక్ పేటలోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ క్రమంలో మంగళవారం వీరబాబు బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. దీంతో వీరబాబు కుటుంబ సభ్యులు పెద్ద మనస్సుతో అవయవదానానికి అంగీకరించారు. వీరబాబు తమకు దూరమైనా ఆయన గుండె ద్వారా మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు. 

మరోపక్క  గుండె కోసం 30 ఏళ్ల వయస్సున్న ఓ పెయింటర్ జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ వీరబాబు గుండెను ఆ పెయింటర్‌కు నిమ్స్ వైద్యులు అమర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.  గ్రీన్ చానెల్ ద్వారా గుండెను మలక్‌పేట్ యశోద హాస్పిటల్ నుంచి పంజాగుట్ట నిమ్స్‌ హాస్పిటల్ కు ఎటువంటి అవాంతరాలు కలగకుండా తరలించారు.దీనికోసం వాహానాల రాకపోకలను కొంత సమయం నిలిపివేశారు.  ఆ గుండెను పెయింటర్ కు నిమ్స్ వైద్య బృందం శస్త్రచికిత్స ద్వారా అమర్చనున్నారు. పెయింటర్‌కు పునర్జన్మ లభించబోతోంది. వీరబాబు గుండె ద్వారా ఊపిరిపోసుకోవడానికి  సిద్ధంగా ఉన్నాడు. కాగా నిమ్స్  హాస్పిటల్ లో ఇప్పటికే పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగిన విషయం తెలిసిందే.