హృదయ విదాకరం.. ఆవు తొక్కడంతో వృద్ధుడి మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

హృదయ విదాకరం.. ఆవు తొక్కడంతో వృద్ధుడి మృతి 

August 13, 2020

VIDEO Sheikh Hamdan cordons off SUV after bird builds nest on it..

చిత్తూరు జిల్లా పలమనేరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ద్ధుడిని ఆవు గుండెలపై తొక్కి గాయపరిచింది. తీవ్ర అస్వస్థతకు గురైన తండ్రిని ఆసుపత్రికి తరలించింది ఆయన కుమార్తె. అయితే, చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో పరీక్షలు చేయించేందుకు బయటకు వెళ్లగా మార్గమధ్యంలోనే సదరు వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఈ క్రమంలో స్థానికులు, ఓ ఆటో డ్రైవర్ ప్రవర్తించిన తీరు ఎంతో దారుణంగా ఉంది. కరోనాతో చనిపోయాడని ఆయన అంత్యక్రియలకు ఎవరూ సహకరించలేదు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కలగటూరు గ్రామానికి చెందిన 73 ఏళ్ల వెంకట్రామయ్య శనివారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఆవు దాడి చేసింది. అతని గుండెలపై కాలుపెట్టి తొక్కింది. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తన తండ్రికి వైద్యం చేయించాలని బాధితుడి కుమార్తె, ఆవు యజమానిని అడిగింది. అందుకు అతను నిరాకరించాడు. దీంతో తన తండ్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయినా తగ్గకపోవడంతో తిరిగి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించింది. ఇంటికి వచ్చాక మళ్లీ ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. 

వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ స్కానింగ్ చేసే పరికరాలు లేకపోవడంతో వేరేచోట తీయించుకుని రమ్మన్నారు. దీంతో ఆయనను స్కానింగ్ చేయించి తీసుకెళ్లగా, ఇంజక్షన్లు వేసి, మాత్రలు ఇచ్చి పంపించారు. గురువారం వేకువజామున ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించింది. దీంతో ఆటోలో మళ్లీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడని తెలియగానే ఆటో డ్రైవర్ మానవత్వాన్ని మరిచాడు. మృతదేహాన్ని అక్కడే దించేసి వెళ్లిపోయాడు. కరోనాతో చనిపోయాడని భావించిన స్థానికులు ఆ మహిళకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తండ్రి శవాన్ని నడిరోడ్డు మీద పెట్టుకుని ఆ తల్లి గుండెలు అవిసేలా రోధించింది. అయినా ఏ ఒక్కరూ కనికరించలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కలగటూరుకు తరలించారు. అంత్యక్రియలకు సహకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై టీడీపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని ఆరోపించింది. ‘డబ్బు పెట్టి ప్రైవేటు ఆసుపత్రులలో చూపించుకోలేక, ఇటు ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు లేక.. కళ్ళముందే కన్న తండ్రిని పోగొట్టుకున్న కూతురి ఆవేదన ఇది. పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో కనీసం స్కానింగ్ సౌకర్యం లేదన్నారంటే.. జగన్ గారి పాలనలో ప్రజారోగ్యానికి ఉన్న భరోసా ఏపాటిదో ఆలోచించండి’ అంటూ టీడీపీ  ట్వీట్ చేసింది.