అమరప్రేమ.. ప్రియురాలి శవంతో పెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

అమరప్రేమ.. ప్రియురాలి శవంతో పెళ్లి..

October 29, 2019

గుండెలను పిండేసే ప్రేమకథ ఇది. వారిద్దరు చిలకా గోరింకల్లా ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుని ఆనందంగా బతకాలని, ఆణిముత్యాల్లాంటి పిల్లలను కనాలని, వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని.., ఇలా ఎన్నో కలలు కంది ఆ జంట. కానీ వారొకటి తలిస్తే విధి ఒకటి తలచింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్న ఆ జంటను విడదియ్యాలని విధి కక్ష్యగట్టింది. క్యాన్సర్ రూపంలో వారి పచ్చని జీవితంలో చిచ్చు రేపింది. ఆమెను శాశ్వతంగా అతని నుంచి దూరం చేసింది. అతను చివరిసారిగా ప్రయురాలి చివరి కోరిక ప్రకారం ఆమె శవానికి తెల్లని గౌను తొడిగించి, పెళ్లి చేసుకున్నాడు. ఆ క్షణాల్లో అతని గుండె ఎంత బరువెక్కిందో, ఎన్నిసార్లు వెక్కి వెక్కి ఏడ్చిందో ఊహించగలం. ఇలాంటి పరిస్థితి ఏ ప్రేమజంటకు రావద్దని కోరుకుంటూ వారి కథేంటో తెలుసుకుందాం. 

Marriage.

చైనాకు చెందిన జూ షినాన్(35) అనే వ్యక్తి యాంగ్ లియూను గాఢంగా ప్రేమించాడు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. వివాహం చేసుకునేందుకు 2013లో కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది. అప్పుడే వారి జీవితాలను తలకిందులు చేస్తూ యంగ్‌కు బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. నాలుగేళ్ల పాటు యంగ్‌కు శస్త్ర చికిత్సతో పాటు కీమోథెరపీ కూడా చేశారు. దీంతో ఆమె నెమ్మదిగా కోలుకుని ఆరోగ్యవంతురాలు అయ్యింది. వారిక పెళ్లి చేసుకుందాం అనుకునేలోపు ఆమె మళ్లీ క్యాన్సర్ బారిన పడింది. దీంతో ఆమె మళ్లీ చికిత్స తీసుకోవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్ 6న ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఆమె మృతి చెందింది. ఆమె చివరి కోరికను తీర్చాలని అతను భావించాడు. ఆమె ఇష్టపడ్డ పెళ్లి గౌనును కొనుగోలు చేశాడు. దానిని యాంగ్ మృతదేహానికి ధరింపజేసి, ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లితంతును చూసి అక్కడున్నవారంతా కన్నీరు కార్చారు.