ఏ వెయిట్ లిఫ్టర్ అయినా 129.5 కిలోల బరువున ఎత్తాడంటే అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అయితే కేవలం ఒక వేలితో అంత బరువును ఎత్తడాన్ని చూస్తే మాత్రం కచ్చితంగా ఔరా అనాల్సిందే. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన స్టీవ్ కీలర్ ఆ ఫీట్‌ను సాధించాడు. ప్రొఫెషనల్ మార్షల్ఆర్ట్ లో నైపుణ్యం కలిగిన స్టీవ్.. సింగిల్ వేలితో భారీ బరువును ఎత్తి పది సంవత్సరాలపాటు ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. తన మధ్య వేలిని ఉపయోగించి 129.49 కిలోల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తి గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ రికార్డును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ఆమోదించింది. దాని గురించి తన అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసింది. తాను 18 ఏళ్ల వయస్సునుంచే కరాటే ప్రాక్టీస్ చేస్తున్నానని, నాలుగేళ్ల నుంచి డెడ్‌లిఫ్ట్ ఎత్తే శిక్షణ తీసుకుంటున్నట్లు కీలర్ చెప్పాడు. అతని శిక్షణా సెషన్లలో ఎత్తిన బరువు ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఎత్తిన దానికంటే 10 కిలోల బరువు మాత్రమే ఉందని తెలుసుకుని గిన్నిస్‌పై కన్నేశాడు. అనుకున్నట్లే కీలర్ 129 కిలోల బరువెత్తి 2012లో 121.69 కిలోలతో ఆర్మేనియన్ బెనిక్ ఇస్రాయెల్యాన్ సాధించిన రికార్డును బద్దలుకొట్టాడు. ఈ విజయాన్ని తన తండ్రికి అంకితమిస్తున్నట్లు కీలర్ తెలిపాడు.