Heavy fine for late RTC bus
mictv telugu

ఆలస్యంగా వచ్చిన ఆర్టీసీ బస్సుకు..భారీ జరిమానా

August 5, 2022

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రయాణికురాలి అస్వస్థతకు కారణమైన టీఎస్ ఆర్టీసీకి వినియోగదారుల కమిషన్ జరిమానాను విధించింది. బస్సు ఆలస్యంగా బస్ స్టేషన్‌కు రావడమేకాక, గమ్యస్థానానికి చేరవేయడంలో కూడా మరింత ఆలస్యం చేసిందని, దీంతో ఓ ప్రయాణికురాలి తీవ్ర అస్వస్థతకు గురైందని అధికారులు మండిపడుతూ, టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా రూ. 1000, కేసు ఖర్చుల కింద రూ.500.. నెలన్నర రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదుకు చెందిన న్యాయవాది ఫహీమా బేగమ్ దిల్‌సుఖ్‌నగర్ నుంచి మణుగూరు వెళ్లేందుకు 2019 ఆగస్టులో టికెట్ బుక్ చేసుకున్నారు. ఆగస్టు 8న బస్టాండుకు వెళ్లగా రాత్రి 7.15కి రావాల్సిన బస్సు నాలుగు గంటలు ఆలస్యంగా (11.15కు 45కు) చేరుకుంది. దాంతో ఆమె బస్టాండులోనే 4 గంటలపాటు వేచి ఉండటంతో అస్వ స్థతకు గురైంది. బస్సు ఆలస్యం కావడంపై డ్రైవర్‌ను ప్రశ్నించగా, అతడు దురుసుగా మాట్లాడాడు.

దాంతో ఆమె రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీసీ…ఆరోపణలు నిరాధారమని, ప్రయాణం రద్దయితేనే టికెట్ డబ్బు రీఫండ్ చేస్తామని, ఫిర్యాదిదారుకు నష్టం కలిగించేలా ఆర్టీసీ ప్రవర్తించలేదని తమ సేవల్లో లోపం లేదని వివరించింది.

ఈ క్రమంలో సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్ అధ్యక్షురాలు చిట్నీని లతాకుమారి, సభ్యులు జీవీఎస్ ప్రసాదరావు, డి. మాధవీలతతో కూడిన బెంచ్ బస్సు మణుగూరుకు 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నట్లు గుర్తించింది. ఆలస్యం వల్ల ఫిర్యాదిదారు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు ధ్రువీకరించిన ప్రిస్కిప్షన్ సాక్ష్యంగా ఉందని, ఇది ముమ్మాటికీ సేవల్లో లోపమే అని పేర్కొంటూ టికెట్ డబ్బుతో పాటు పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.