రాంగ్ రూట్‌కు రూ. 1700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ. 1200! - MicTv.in - Telugu News
mictv telugu

రాంగ్ రూట్‌కు రూ. 1700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ. 1200!

November 21, 2022

హైదరాబాద్‌లోని వాహనదారులు మరింత అప్రమత్తం కావాలి. ఎవరూ చూడడం లేదు కదా అని జామ్మని దూరిపోతే జేబులు గుల్ల అవుతాయి. ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేసేందుకు పోలీసులు ఈసారి మరింత పెద్ద కొరడాలతో వస్తున్నారు. రాంగ్‌ రూట్‌, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీ జరిమానాలు విధిస్మని ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్‌ హెచ్చరించారు. ‘‘ఎక్కువ నష్టం కలిగించే వాహనాలకు ఎక్కువ జరిమానా వేస్తాం. ఎక్కువ శాతం ప్రమాదాలు రాంగ్ రూట్‌లో వెళ్లడం, ట్రిపుల్‌ రైడింగ్‌ కారణం. అందుకే రాంగ్ రూట్‌లో వచ్చే బండ్లకు రూ.1,700 వరకు, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే రూ.1200 వరకు జరిమానా విధించాలని కసరత్తు చేస్తున్నాం.

ఈనెల 28 నుంచి ట్రాఫిక్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఉంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పాత చలాన్ల సంగతీ తేలుస్తాం. ట్రాఫిక్‌ చలాన్లే మా ప్రధాన ఆదాయం అని ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. ప్రభుత్వం మాకు వేల కోట్లు ఇస్తోంది’’ అని అన్నారు. నగరంలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉందని దీ కోసం ‘ఆపరేషన్‌ రోప్‌’ను అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా, ఇప్పటికే చలాన్లు భారంగా ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు. రోడ్లు సరిగ్గా లేవని, ముందు వాటి సంగతి చూసి, తర్వాత జరిమానాలు వేయండని కోరుతున్నారు.