తెలుగు రాష్ట్రాలను వదలని వరద
ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నదులు పొంగిపొర్లుతుండటంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే జూరాల, శ్రీశైలం జలాశయాలు పూర్తిగా నిండటంతో కిందకు నీటిని వదిలారు. వరద నీటి కారణంగా నాగార్జునసాగర్ నిండిపోవడంతో 8 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేశారు. డ్యాం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.
మరోవైపు గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం, కోనసీమ లంక గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుకునూరు, వీఆర్‌పురం మండలాలు వరద నీటిలో ఉన్నాయి. భారీగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు చర్యలు చేపట్టాయి. ఈ ఏడాది మూడోసారి వరదలతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.