రాజమండ్రిలో గాలివాన బీభత్సం.. మహానాడు వద్ద నేతలకు తప్పిన ప్రమాదం
ఏపీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్యాహ్నానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలు జిల్లాల్లో ఇలాంటి వాతావరణమే కొనసాగుతుండటంతో ఎండలతో అల్లాడిపోయిన జనం కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే భారీ వర్షాలకు తోడు ఈదురు గాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం అవస్థలుపడుతున్నారు.
#WATCH | Andhra Pradesh: Rain and storm obstruct Telugu Desam Party’s (TDP) Mahanadu program, at Vemagiri on the outskirts of Rajamahendravaram pic.twitter.com/SKDrYbJXvA
— ANI (@ANI) May 28, 2023
నేతలకు తప్పిన ప్రమాదం
రాజమండ్రిలో సైతం భారీ వర్షం కురుస్తోంది. టీడీపీ మహానాడు సభా ప్రాంగణం వద్ద ఈదురు గాలులతో కూడిన వానపడుతోంది. దీంతో సభకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు కూలిపోయాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో మహానాడు సభా ప్రాంగణం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. భారీ ఈదురు గాలులకు నేతల కటౌట్ ఒక్కసారిగా వీఐపీ టెంట్‌పై పడ్డాయి. అప్పటి వరకు అదే టెంట్‌లో ఉన్న నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు తదితర ముఖ్యనేతలు అంతకు కొద్ది సేపటి క్రితమే ఆ టెంట్ నుంచి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి నుంచి మహానాడు సభా ప్రాంగణానికి వస్తున్న సమయంలో వర్షం కురిసింది. దీంతో ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో సభా వేదిక వద్దకు చేరుకోవడం ఆలస్యమైంది.
తిరుపతిలో ఇండ్లు ధ్వంసం
తిరుపతిలోని కొరమీను గుంట ప్రాంతంలో వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ఇండ్ల రేకులు ఎగిరిపోయాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. గంటల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.