Heavy rain forecast for six districts of AP
mictv telugu

ఏపీ : ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన.. హెచ్చరికలు జారీ

September 8, 2022

రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడి రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. దీని వల్ల విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లిన వారు తిరిగి రావాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ కోరారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల జలమయం, రవాణా వ్యవస్థకు ఆటంకం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశముందని వివరించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెరువులు, కాలువలు, నదులు, వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు. అటు కర్ణాటకలో కురిసిన వర్షాలకు క‌ృష్ణా నది పొంగి ప్రవహిస్తుంది. ఫలితంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్ నుంచి 2.93 లక్షల క్యూసెక్కుల నీటిని 20 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.