హైదరాబాద్‌లో మరోసారి వడగండ్ల వాన దంచికొట్టింది. సాయంత్రం నుంచి నగరవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. పలుచోట్ల వడగండ్లు పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లపై వడగండ్లు పడి.. అద్దాలు పగిలాయి. బైక్ పై వెళ్లేవారికి వడగండ్ల వాన ఇబ్బంది పెట్టింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మరో నాలుగు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో నగరంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం పరిశర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రెండ్రోజుల నుంచి పలు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి అందివచ్చిన పంట వర్షార్పణం అవుతోంది. దీంతో రైతుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, వరి, మక్క, బొప్పాయి, మిర్చి రైతులు భారీగా నష్టపోయారు.