హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..రోడ్లన్నీ జలమయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం అర్థరాత్రి 12 దాటాక వర్షం దంచికొట్టింది. దీంతో కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. గతకొన్ని రోజులుగా తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గత అర్ధరాత్రి 12న దాటిన తర్వాత ఎవరు ఉహించని రీతిలో వర్షం భీభత్సం సృష్టించింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, డైనేజీలు వరద నీటితో నిండిపోయాయి. కొంతమంది చిరుద్యోగులు, వాహనదారులు విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే సమయంలో వర్షం భారీగా పడుతున్నప్పటికి చేసేది ఏమిలేక తడుచుకుంటూనే వెళ్లారు. ముఖ్యంగా ఈ వర్షం.. బంజారాహిల్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ముషీరాబాద్, కాప్రా, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఇక, అర్థరాత్రి భారీగా కురిసిన వర్షం కారణంగా కోఠిలో ఓ బైక్ వరదలో కొట్టుకుపోగా, మలక్‌పేట వంతెన దిగువన నడుము లోతులో నీరు చేరడంతో రాకపోకలు గంటలపాటు నిలిచిపోయాయి. అనంతరం ఎల్బీనగర్ పరిధిలోని చింతల్‌కుంట జాతీయ రహదారిపైనా మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వరద నీరును మళ్లీంచే ప్రయాత్నాలు చేశారు.