తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో శబ్ధాలు చేస్తూ, భారీ వర్షం పడింది. వర్ష కారణంగా పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గతకొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ఎండలు కొడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఎండ, మరోవైపు ఉక్కబోతతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేక అల్లాడిపోయారు.
ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. దాంతో ప్రజలు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఫలితంగా హైదరాబాద్ నగరమంతా ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగర వాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది.
ఇక, వర్షం కారణంగా అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాపేట, చంపాపేట, సరూర్‌నగర్, కొత్తపేట, దిల్సుఖ్నగర్, వనస్థలిపురంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు భారీగా చేరుకుంది. పలు ప్రాంతాల్లో డైనేజీలు లీక్ అయ్యాయి. అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.