హైదరాబాద్ విలవిల.. మెట్రోకు కూడా అంతరాయం  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ విలవిల.. మెట్రోకు కూడా అంతరాయం 

October 13, 2020

Heavy rain in Hyderabad .. Metro also disrupted

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదారాబాద్ నగరం చిరుటాకులా వణుకుతోంది. ఈ సాయంత్రం నుంచి వాన అదేపనిగా కురుస్తోంది. దీంతో రోడ్లు సెలయేళ్లను తలపిస్తున్నాయి. శివారు కాలనీలు నీట మునిగాయి. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్ల మీద నీళ్లు నిండిపోతున్నాయి. కార్లు, ఆటోలు, బైకులు వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి.  అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో చెట్టు కూలిపోవడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఫ్లైఓవర్ల మీద కూడా నీరు నిండిపోయి కింద పడుతుంటే ఆ నీటిని చూసి జనాలు జడుసుకుంటున్నారు. ఈ మేరకు నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇళ్లనుంచి పిల్లలను బయటకు పంపొద్దని చెప్పారు. విద్యుత్ స్తంబాల దగ్గరికి అస్సలు వెళ్లవద్దని హెచ్చరించారు.

ఎడతెరిపి లేకుండా పట్టుకున్న ముసురు కారణంగా హైదరాబాద్‌ మెట్రో సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట- ఎల్బీనగర్‌ మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. భారీగా గాలులు వీస్తుండటంతో అక్కడక్కడా కొద్దిసేపు మెట్రో రైళ్లను నిలిపివేశారు. ముసారాంబాగ్‌ స్టేషన్‌లో 10 నిమిషాలు, దిల్‌షుఖ్‌నగర్‌లో 5 నిమిషాల పాటు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. తీవ్ర వాయుగుండం బలహీన పడిందని వాతావరణ శాఖ మంగళవారం రాత్రి వెల్లడించింది. రేపు మధ్యాహ్నం వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉందని.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల సిద్దిపేట, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కాగా, ఈ ఉదయం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నల్గొండ ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. నల్గొండలోని ప్రకాశం బజార్‌లో వరద నీరు నిలిచిపోయింది. నార్కెట్‌పల్లి-అద్దంకి హైవేపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోగా, తిప్పర్తి హైవేపై వరద నీరు నదిలా పొంగుతోంది.