చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేకా వరద నీరు రోడ్లపై పారుతోంది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. వర్షం పడితే చాలు వాహనాదారులు రోడ్లపైకి రావడానికి వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రజలకు పిడుగులాంటి వార్త వినిపించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 72 గంటల పాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 9 నుండి 16 సెంటిమీటర్ల అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనిన్నారు.
వరద పరిస్థితిని ఎదుర్కోవడానికి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంటర్లుగా గుర్తించిన పాఠశాలలో, కమ్యునిటీహాల్స్, ఇతర వసతులను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులందరూ అందుబాటులో ఉండాలని కమిషనర్ ఆదేశించారు. అత్యవసర అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకూడని తెలిపారు. ముఖ్యంగా వాహనాదారులు అత్యవసరం అయితేనే వాహనాలను రోడ్లపైకి తీసుకుని రావాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం పడుతున్నప్పుడు, వరద వస్తున్నప్పుడు చిన్న పిల్లలను బయటికి పంపకూడదని తెలిపారు.