జలదిగ్బంధంలో మహానంది క్షేత్రం
కర్నూలు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం 'మహానంది' జలదిగ్బంధంలో చిక్కుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలయంలోని రెండు కోనేర్లు నిండడమే కాకుండా లోపలి కోనేటిలోకి వరదనీరు చేరింది. రుద్రగుండం పుష్కరిణిలో ఉన్న పంచలింగాలపైకి నాలుగు అడుగుల ఎత్తు మేర వరద నీరు చేరింది.
భక్తులు ఎవ్వరూ స్వామి వారి దర్శనం చేసుకోలేకపోతున్నారు. ఇలా జరగడం మహానంది క్షేత్ర చరిత్రలోనే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అర్జున శర్మ వరద నీటిలోనే ఆలయం లోపలికి వెళ్లి మహానందీశ్వరస్వామి, కామేశ్వరి అమ్మవార్లకు అభిషేకార్చనలు చేశారు. రాళ్లవాగు, నల్లమల అడవి నుంచి వచ్చే పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో మహానంది-నంద్యాల, మహానంది-ఒంగోలు జాతీయ రహదారికి మధ్య రాకాపోకలు నిలిచిపోయాయి. మండలంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.