తెలుగు రాష్ట్రాలను వానలు భయపెడుతున్నాయి. వచ్చే మూడు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నందున వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణకోస్తాలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈరోజు, రేపు ఉత్తరకోస్తా, గోదావరి జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోపక్క ఇవాళ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పింది.
తెలంగాణకు వాన ముప్పు
తెలంగాణను కూడా వానలు భయపెడుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో అది అల్పపీడనంగా మారనుందని అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అన్నారు. కాగా, శనివారం కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సైబారాబాద్ కమిషనర్ సజ్జనార్ పర్యటించారు. మరోవైపు హోమంత్రి మహమూద్ అలీ పాతబస్తీ ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. వరద ప్రాంతాల్లో వాహన దారులు నీళ్లలో నుంచి ఎవరు వెళ్లకూడదని.. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. వరద నీటిలో వహనాలు వస్తే సీజ్ చేస్తామని చెప్పారు. కాగా, హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే హిమాయత్ సాగర్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారిపోయింది. దీంతో ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుకుంది. అప్రమత్తమైన జలమండలి అధికారుల ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం నుంచి క్రమక్రమంగా గేట్లు ఎత్తుతున్నారు. వరద ఉధృతి మళ్లీ భారీగా పెరగడంతో తెల్లవారుజామున ఒకేసారి మరో 6 గేట్లను తెరిచారు.