ఉపరితల ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘామృతమై ఉరుములు పెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని కోస్తా జిల్లాలు, తూర్పు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వాన నీరు చేరి పంటను నీటముంచింది. పంట తీరు చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్ , వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, నిజామాబాద్, హన్మకొండ, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ , కామారెడ్డి జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని , పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.