తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని కాసేపటిక్రితమే హైదరాబాద్లో ఉన్న వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుూ..”తెలంగాణలో ఇటీవలే కుంభవృష్టి కురిపించిన అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి, ఆదివారం మళ్లీ భూమిపైకి వచ్చింది. ఆదివారం సాయంత్రం ఒడిశా తీరంపై కేంద్రీకృతమై ఉంది. గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో సోమవారం భారీగా, మంగళవారం ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది” అని ఆమె అన్నారు.
మరోపక్క తెలంగాణలో గతవారం కురిసిన భారీ వర్షాల కారణంగా గుంతలు, చెరువులు, నదులు, ప్రాజెక్ట్లు వరదతో నిండిపొర్లుతున్నాయి. దీంతో భద్రాచలంలో పలు కాలనీలు వదర నీటితో నిండిపోయి, నేటికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, కేసీఆర్ ఏరియల్ సర్వే చేయించి, భద్రాచలంలో గోదావరి నది పరీవాహక ప్రాంతాల ప్రజలు ఎలాంటి అవస్థలు పడకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరు రోజులపాటు కురిసిన వర్షాల కారణంగా వరద భారీగా వచ్చింది. ఆ వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రోజున భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.