తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు! - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

October 22, 2019

Heavy rains in Telugu states!

ఈసారి వర్షాలు వద్దన్నా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నా ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రెండు రోజులు కాస్త తెరిపి ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ కురవడానికి సిద్ధం అవుతున్నాయి. రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణ పరిస్థితి దృష్ట్యా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా 5 కిలోమీటర్ల ఎత్తులో వాయువ్య దిశగా ఉపరితల ఆవర్తనం ఉందని అన్నారు. 

రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత తీవ్రంగా మారి.. ఉత్తర వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంట 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. మంగళవారం నుంచి అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.