అంతంత జరిమానాలు మేము విధించం.. దీదీ సీరియస్ - MicTv.in - Telugu News
mictv telugu

అంతంత జరిమానాలు మేము విధించం.. దీదీ సీరియస్

September 11, 2019

Mamata Banerjee ..

దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్‌ వాహన సవరణ చట్టం-2019ను అనుసరించి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహనదారులకు అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా అసహనం వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ చట్టంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానాలు విధించడాన్ని దీదీ తప్పుబట్టారు. నిబంధనలు చాలా కఠినంగా వున్నాయని ఆమె అన్నారు. దీనిని తమ రాష్ట్రంలో అస్సలు అమలుచేయమని స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వున్నాయని తెలిపారు. 

ఈ నేపథ్యంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘పార్లమెంటులో మేము ఈచట్టాన్ని వ్యతిరేకించాం. ఒకవేళ నూతనంగా సవరించిన వాహన చట్టాన్ని అమలు చేస్తే సామాన్య ప్రజలను హింసిండచడమే అవుతుంది. జరిమానాలతో సమస్యలు పరిష్కారం అవుతాయని ఎలా అనుకుంటారు? కాస్త కూడా మానవతా దృక్పథం లేకుంటే ఎలా? ఇప్పటికే ‘సేఫ్‌ డ్రైవ్‌.. సేవ్‌ లైఫ్‌’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతున్నాం’ అని దీదీ అన్నారు. నూతన వాహన చట్టం కింద జరిమానాలు భారీగా విధిస్తున్న క్రమంలో గుజరాత్‌, రాజస్థాన్ ప్రభుత్వాలు వెనక్కు తగ్గాయి. భారీగా జరిమానాలను తగ్గిస్తామని వెల్లడించాయి.