వెనక కూర్చున్నా హెల్మెట్ పెట్టాల్సిందే,  లేదంటే రూ.100 ఫైన్ - MicTv.in - Telugu News
mictv telugu

వెనక కూర్చున్నా హెల్మెట్ పెట్టాల్సిందే,  లేదంటే రూ.100 ఫైన్

February 3, 2020

Helmet

ఒక్క హెల్మెట్ పెట్టుకోవడానికే కొందరు వెనకా ముందు అవుతున్నారు. బండి నడిపేవారు హెల్మెట్ ధరించడం అనే నిబంధన ఉన్నప్పటికీ ఆ కొందరు పాటించడం లేదు. అలాంటిది బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్సి వస్తే? హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెనకున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలనే కొత్త నిబంధన అమలులోకి తీసుకువచ్చారు. వెనుకున్న వ్యక్తి ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే రూ.100 ఫైన్ విధిస్తాం అంటున్నారు. కొన్ని రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డప్పటికీ, వెనుక కూర్చున్నవారు చనిపోతున్నారు. 

అందుకు కారణం హెల్మట్ లేకపోవడమే అని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. 70 శాతం ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో వెనుక కూర్చున్నవారి క్షేమం కోసమే హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నాం అని పోలీసులు వెల్లడించారు.  ట్రాఫిక్ నిబంధనలను పాటించాలనే ఉద్దేశంతో ఫైన్లు విధిస్తున్నామని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ నిబంధన అమలు చేస్తున్నారు. అప్పుడే జరిమానాలు కూడా విధిస్తున్నారు. బైక్ పై ఇద్దరు వెళ్తే… ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అని ట్రాఫిక్ పోలీసులు తేల్చి చెప్పారు.