ఫ్లైఓవర్ బాధితురాలకి జగన్ అండ.. శస్త్ర చికిత్సకు సాయం..  - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లైఓవర్ బాధితురాలకి జగన్ అండ.. శస్త్ర చికిత్సకు సాయం.. 

November 25, 2019

Help CM Jagan of the victim to BioDiversity fly over.. Help for Surgery..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి మరిచిపోలేం. ఆఫీసుకు త్వరగా వెళ్లాలన్న అతని అతివేగం అమాయకుల ప్రాణాలు తీసింది. రోడ్డు మీదకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరుతాడు అనే నమ్మకం లేకుండా చేసింది. పాపం వాళ్లు ఆటో, బస్సు కోసం రోడ్డు పక్కన చెట్టుకింద నిలబడ్డారు. అంతే మృత్యువు ఫ్లైఓవర్ మీదనుంచి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందారు. ఆమె కుమార్తె కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లతో పాటు మరో మహిళ, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన అనంతపురంకు చెందిన కుబ్రాబేగం(23) వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. 

అయితే ఆమెకు జగన్ ప్రభుత్వం అండగా నిలబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి తక్షణ సహాయం కింద రూ.3,60,000 మంజూరు చేసిందని వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. కుబ్రాబేగం శస్త్రచికిత్సకు రూ.6 లక్షలు ఖర్చు అవుతుందని బాధితురాలి తండ్రి అబ్దుల్ అజీమ్ సహాయం కోసం అర్థించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3,60,000  మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారని వెల్లడించారు.