Help the poor people with stolen money
mictv telugu

కిక్ సినిమా రిపీట్..దోచుకున్న సొమ్ముతో పేదలకు సాయం

November 19, 2022

Help the poor people with stolen money

అతడు పోలీసులకు దొంగ..పేదలకు, ఏ దిక్కు లేని వారికి మాత్రం అతనో హీరో. ఉదయం పనికిపోవడం..రాత్రి చోరీలు చేయడం. వాటిలో కొంత అభాగ్యులకు దానం చేయడం ఆయన వృత్తి. ఇది ఏదో సినిమా కథ కాదు. రీల్ స్టోరీని పోలిన రియల్ స్టోరీయే. అలాంటి ఓ వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అతని విచారణలో విస్తుపోయే నిజాలు తెలిసి షాక్ అయ్యారు.

పీర్‌కంకరనైకి చెందిన వరదరాజన్ అనే వ్యక్తి ఇంట్లో కొన్ని రోజుల కిందట దొంగతనం జరిగింది. బెడ్రూమ్‌లో అల్మారా పగులగొట్టి ఉంది. 8 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు కోసం గాలించారు. చివరికి ఎగ్మోర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు అంబురాజ్ దొంగతనం చేసినట్లు గుర్తించారు. ఈ బుధవారం అతనిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే అతనిని విచారించిన పోలీసులకు కొన్ని ఆశ్చర్యకరమైన విషాయాలు తెలిశాయి.

రాత్రిళ్లు చోరీ చేయగా వచ్చిన సొమ్ముతో రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న నిరాశ్రయులు, నిరుపేదల ఆకలి తీరుస్తున్నట్లు అంబురాజ్.. పోలీసులకు తెలిపాడు. నిరుపేదల ఆకలి కష్టాలు తనకి తెలియడంతో వారికి సాయం చేస్తున్నట్లు వెల్లడించాడు. అతను చెప్పింది పోలీసులు నిర్ధారణ చేయగా నిజమేనని తేలింది. ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌ సమీపంలో పేవ్‌మెంట్‌పై ఉన్న కొంత మందికి అంబురాజ్ తరచూ ఆహార పదార్థాలను పంచిపెట్టడం తాము చూశామని పోలీసులకు కొంత మంది స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అంబురాజ్‌ను పోలీసులు జ్యుడీషియల్ కష్టడీకి తరలించారు. ఏదేమైనా ఇలాంటి మంచి దొంగలను ఈ కాలంలో అరుదుగా చూస్తుంటాం.అంత కష్టపడి దొంగతనం చేసిన సొమ్మును పంచిపెడుతున్నాడంటే అతనికి నిజంగా ఆకలి విలువ తెలిసే ఉండాలి.