హైదరాబాద్ చందానగర్‌లో కులహత్యకు గురైన యువకుడు హేమంత్ భార్య అవంతికా రెడ్డి ఈ రోజు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కలిసింది. హేమంత్ కుటుంబ సభ్యులతో కలిసి సైబరాబాద్ సీపీ సజ్జనార్ వద్దకు వెళ్లింది. ఆయన కాళ్లకు దండం పెట్టి, తమకు న్యాయం చేయాలని కోరింది.
తన భర్తను చంపిన వాళ్లను వదలొద్దని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి శిక్షించాలని వేడుకుంది. అంతేకాకుండా నిందితుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలని కోరింది. దీనికి సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. హేమంత్ ఇంటి వద్ద రోజుకు 24 పాటు సెక్యూరిటీ కల్పించాలని పొలీసులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేస్తామని, దోషులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన అవంతికకు హామీ ఇచ్చారు. హేమంత్, అవంతికలు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకుని నాలుగు నెలల కిందట వివాహం చేసుకోవడం, అవంతి కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేక హేమంత్‌ను కిరాయి హంతకులతో చంపించడం తెలిసిందే. కాగా ఈ కేసులో నిందితులు ప్రస్తుతం పోలీస్ కస్టడీ ఉన్నారు. మొత్తం 21 మంది అరెస్ట్ కాగా, నలుగురు తప్పించుకుని తిరుగుతున్నారు.