ఇక నుంచి డిగ్రీ నాలుగేండ్లు: యూజీసీ - MicTv.in - Telugu News
mictv telugu

ఇక నుంచి డిగ్రీ నాలుగేండ్లు: యూజీసీ

March 17, 2022

hhhr

యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్స్ నాలుగేళ్లు ఉంటుందని, 8 సెమిస్టర్లు ఉంటాయని తెలిపింది. ఈ సందర్బంగా గురువారం ఈ విధానానికి ఆమోదం తెలుపుతూ యూజీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ”ఇకనుంచి డిగ్రీ కోర్స్ నాలుగేళ్లు, ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయి. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, అప్పటివరకు విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా సబ్జెక్టుల కేటాయింపు ఉంటుంది. ఏడు, ఎనిమిది సెమిస్టర్లలో విద్యార్థులు వారు ఎంచుకున్న సబ్జెక్టులోని ఏదైనా అంశంపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది” అని తెలిపింది.

అంతేకాకుండా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ఆర్ట్స్, సైన్స్ గ్రూపులకు, వొకేషనల్, అకడమిక్ విభాగాలకు పెద్దగా వ్యత్యాసం ఉండదని యూజీసీ స్పష్టం చేసింది. మరోవైపు పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి కూడా యూజీసీ కీలక మార్పులు చేసింది. ఇప్పటికే ఉన్న నేషనల్ ఎలిజిబులిటీ టెస్టుకు అదనంగా మరో ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టింది. ఇన్నాళ్లు యూనివర్సిటీలు మాత్రమే పీహెచ్‌డీ ప్రవేశాలను అందించేవి. ఇకపై ఎన్‌ఈటీ లేదా జేఆర్ఎఫ్ ద్వారా 60 శాతం ప్రవేశాలను అధికారులు భర్తీ చేయనున్నారు. మిగిలిన 40 శాతం సీట్లను యూనివర్సిటీలు ప్రత్యేక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి భర్తీ చేయనున్నాయి. ఈ వివరాలను యూజీసీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.