Her face is the canvas….
mictv telugu

ఆమె ముఖమే కేన్వాస్….

November 26, 2022

మేకప్….ఒకప్పుడు ఇది చాలా అరుదు. కేవలం సినిమాల్లో నిటించే వాళ్ళఉ మాత్రమే వేసుకుంటారు లేదా బాగా డబ్బున్న వాళ్ళు వేసుకుంటారు అని ఉండేది. కానీ ఇప్పడు మేకప్ చాలా సర్వసాధారణం అయిపోయింది. తమకు ఎంత అందం ఉంటే అంతే అన్నట్టు ఈ కాలం అమ్మాయిలు అనుకోవడం లేదు. అందంగా ఉంటే దాన్ని మరింత బాగా చూపిస్తున్నారు. లేకపోతే మేకప్ తో తెచ్చుకుంటున్నారు. చాలా మందికి ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా కూడా పనిచేస్తోంది. ఇంతకు ముందు మేకప్ అంటే తెల్లగా కనిపించడం, కొంత పైపై మెరుగులు అంతే. కానీ ఇప్పడు అందులో ఎన్నో రకాలు, ఎన్నో ప్రోడక్ట్స్. ప్రతీదానికి ఒక ప్రత్యేకత.

అందంగా కనిపించడానికి మేకప్ వేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ దానిని దాటుకుని ఇంకొంచెం పైకి వెళ్ళి ఆలోచించిందో అమ్మాయి. అందరి అమ్మాయిల్లా కాకుండా డిఫరెంట్ గా ఉండాలనుకుంది. మేకప్ తో తనకు లేని ముఖాన్ని కూడా సృష్టిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది ప్రియాంక పన్వర్. మేకప్‌ మీద ఉన్న మక్కువతో చేస్తోన్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి మంచి ఆర్టిస్ట్‌గా మారింది ప్రియాంక పన్వర్‌. దేశవిదేశాల్లోని ప్రముఖ సెలబ్రెటీల ముఖాన్ని తన ముఖంపై చిత్రించి ఔరా అనిపిస్తోంది. చనిపోయిన ఎంతో మంది సెలబ్రెటీలకు సైతం తన మేకప్‌ ద్వారా నివాళులర్పిస్తోంది.

ఘజియాబాద్‌కు చెందిన ప్రియాంక పన్వర్‌ ఫార్మసీలో మాస్టర్స్‌ చేసిన తరువాత, రెగ్యులేటరీ అఫైర్స్‌లో ఉద్యోగం చేసుకుంటూ బిజీగా ఉండేది. ఉద్యోగంలో చేసే పని బావున్నప్పటికీ తనకి పెద్ద ఆసక్తి ఉండేది కాదు.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. తనకి ఎంతో ఇష్టమైన కెనడాకు చెందిన ఇల్యూషన్‌ ఆర్టిస్ట్‌ ‘మిమి చాయిస్‌’ మేకప్‌ వీడియోలను చూస్తూ తను కూడా ఆమెలానే ఆర్టిస్ట్‌ కావాలనుకుంది. అనుకున్న వెంటనే బేసిక్‌ మేకప్‌ కోర్సు నేర్చుకుంది. తనకు నచ్చిన సెలబ్రెటీల రూపాలను వేయడం ప్రారంభించి చక్కగా వేయడం వచ్చాక చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ఇల్యూజన్‌ మేకప్‌కు కేటాయించింది.

తనకు నచ్చిన ముఖ కవళికలను మేకప్‌ మెళకువలతో అందంగా రూపొందిస్తూ ‘మేకప్‌ బై ప్రియాంక పన్వర్‌’ పేరుతో ఉన్న తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేస్తుండేది. ప్రియాంక మేకప్‌ వీడియోలు నెటిజనులకు నచ్చుతుండడంతో మరింత ఉత్సాహంతో ఇల్యూజన్‌ స్కెచ్‌లు వేస్తుండేది. సెలబ్రిటీల ముఖాలు వేయడం మాత్రం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో మొదలెట్టింది ప్రియాంక. అతను చనిపోయాక మేకప్‌తో తనముఖంపై సుశాంత్‌ ముఖాన్ని చిత్రించి నివాళులు అర్పించింది. సుశాంత్‌ రూపం తీసుకురావడానికి ఏడు గంటలపాటు కష్టపడిందట. తొలి సెలబ్రెటీ రూపం అయినప్పటికీ ఎంతో చక్కగా వచ్చిందని వ్యూవర్స్‌ కామెంట్స్‌ చేయడంతో ఆమె అప్పటినుంచి ఫుల్ టైమ్ ఇల్యూజన్‌ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.

సెలబ్రెటీల నుంచి సినిమాలదాకా…

సుశాంత్‌ సింగ్‌ముఖంతో ప్రారంభమైన ప్రియాంక ఇల్యూజన్‌ మేకప్‌ ఆ తరువాత విరాట్‌ కోహ్లి, మనీ హీస్ట్‌ నటులు, బప్పీ లహరీ, రాజ్‌కుమార్‌ రావ్, అల్లు అర్జున్, గురురంధ్వా, కెల్లీ జెన్నర్, బిల్లీ పోర్టర్, దిల్జిత్‌ సింగ్, మిల్కా సింగ్, గాయకుడు మూసావాల రూపాలను చక్కగా తీర్చిదిద్ది వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.సెలబ్రెటీల ముఖాలేగాక ‘రే’ సినిమాలోని కేకే మీనన్‌ క్యారెక్టర్‌ను తన ఇల్యూషన్‌ ఆర్ట్‌తో చక్కగా తీర్చిదిద్దింది. అన్నింటికన్నా ప్రియాంక తన నానమ్మ ముఖాన్ని చిత్రించుకున్నప్పుడు బాగా పాపులర్ అయింది. ఇన్ స్టాలో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది.

మేకప్‌లో చిన్న తప్పు జరిగినా మొత్తం పాడైపోతుంది. అనుకున్న రూపు రేఖలు రావు. ఇల్యూజన్‌ ఆర్ట్‌ సవాలుతో కూడుకున్నదైనప్పటికీ మనసుపెట్టి వేస్తే పెద్ద కష్టం కాదు. ఒక్కో ముఖాన్ని అచ్చుగుద్దినట్టు తీసుకురావడానికి కొన్ని గంటలు పడితే, మరికొన్నింటికి రోజంతా పడుతుంది. త్రీడి ఇమేజ్‌ రావాలంటే చాలా కష్టపడాలి అంటోంది ప్రియాంక.యాక్సెసరీస్, విగ్స్, లెన్స్, అవుట్‌ ఫిట్స్‌ అన్నీ చక్కగా కుదిరితేనే ఇల్యూషన్‌ ఇమేజ్‌ చక్కగా వస్తుంది. ‘‘ఏపీజే అబ్దుల్‌ కలాం, విక్రమ్‌ బాత్ర, జీత్‌లాల మా నానమ్మ ముఖాలు నేను రూపొందించిన వాటిలో నాకు బాగా నచ్చినవని చెబుతోంది.