తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన వివరాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన వివరాలు ఇవే..

May 5, 2022

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. ‘మొదటగా రేపు (శుక్రవారం) ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.10 గంటలకు ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరి, 5.45కు వరంగల్‌లోని గాబ్రియెల్ స్కూలుకు చేరుకుంటారు. 6.05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం రాత్రికి బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో బస చేస్తారు” అని తెలిపారు.

శనివారం రోజు 12.30 గంటలకు తాజ్‌కృష్ణ నుంచి డైరెక్ట్‌గా సంజీవయ్య పార్క్‌కు చేరుకొని, 12.50-1.10 మధ్య దివంగత సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారని తెలిపారు. ఆ తర్వాత గాంధీ భవన్‌కు చేరుకొని 2.45 వరకు పార్టీ నేతలతో సమావేశం కానున్నారని వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని, 5.50 గంటలకు ఢిల్లీకి వెళ్తారని నాయకులు వివరాలను వెల్లడించారు.

మరోపక్క రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రానున్న సందర్భంగా ట్యాంక్ బండ్ , గన్ పార్క్ వద్ద కార్యకర్తలు భారీ ప్లెక్సీలను కట్టారు. కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నాయకుల, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతోందని ఇటు ప్రజల్లో, అటు అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. పర్యటనలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసు అధికారులు అప్రమత్తమైయ్యారు.