యూపీలో బీజేపీ గెలుపుకు కారణాలివే.. - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో బీజేపీ గెలుపుకు కారణాలివే..

March 10, 2022

09

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఇందుకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

1. శాంతి భద్రతల పరిరక్షణ
లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉండే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. హత్యలు, దారి దోపిడీలు, దొంగతనాలు, కబ్జాలు, మానభంగాలు విచ్చలవిడిగా జరిగేవి. యోగీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదట దీనిపైనే దృష్టి పెట్టారు. వందల సంఖ్యలో రౌడీ షీటర్లు, మాఫియా డాన్‌లను ఎన్‌కౌంటర్‌ చేశారు. వేల మందిని జైళ్లలో వేశారు. దీంతో మిగతా రౌడీలు భయపడి రాష్ట్రం వదిలి పారిపోయారు. వారి ఇళ్లను యోగీ ప్రభుత్వం జేసీబీలతో కూల్చివేయించింది. అంతేకాక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కొత్త చట్టం చేసి రాష్ట్రంలో ప్రశాంత
వాతావరణం నెలకొనేలా చేసింది.

2. అయోధ్య రామ మందిర నిర్మాణం
కోర్టు కేసులో చిక్కుకొని అనేక ఏళ్ళుగా పరిష్కారానికి నోచుకోని అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేయడం యోగీ ఘనతగా ఓటర్లు భావించారు. అనంతరం ఎలాంటి ఆలస్యం లేకుండా మందిర నిర్మాణ పనులు ప్రారంభం కావడం కలిసొచ్చింది. అలాగే ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయ పరిసరాల్లో సుందరీకరణ, ఆలయ విస్తరణ, గంగా నది ప్రక్షాళణ వంటి అంశాలు హిందూ ఓటు బ్యాంకు నమ్మకం కోల్పోకుండా కాపాడాయి.

3. కేంద్ర ప్రభుత్వ ప్రభావం
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే కలిగే లాభాలను బీజేపీ ప్రజలకు చేరువయ్యేలా వివరించగలిగింది. ఎక్స్‌ప్రెస్ వేలు, రైల్వే ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ఇప్పటి వరకు కేంద్రం చేసిన సహాయాన్ని విరివిగా ప్రచారం చేశారు. ఇందుకు బుందేల్ ఖండ్, పూర్వాంచల్, నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలన ఉదాహరణగా చూపారు. దీంతో బీజేపీ వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందనే భావన ప్రజల్లో బలంగా ఏర్పడింది.

4. సుపరిపాలన
అందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాలనలో ఎక్కడా వివక్ష చూపకుండా యోగీ ప్రభుత్వం అమలు చేసిన పారదర్శకత యూపీ ఓటర్లను ఆకట్టుకుంది. కొన్ని వర్గాలను సంతోషపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఓటర్లు యోగీ ప్రభుత్వాన్ని నమ్మారు. అలాగే కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఎవ్వరినీ, ఎక్కడా ప్రోత్సహించకపోవడం వంటివి సామాన్యుల్లో కూడా యోగీ అంటే అభిమానం ఏర్పరచేలా చేశాయి.

5. మోదీ, షాల చాణక్యం
ఎన్నికల కంటే ముందునుంచే మోదీ, అమిత్ షాలు యూపీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ పార్టీ ఆయుధమైన సోషల్ ఇంజనీరింగ్‌ను విజయవంతంగా అమలు చేశారు. బంధుప్రీతి, టిక్కెట్లు అమ్ముకోవడం వంటివి చేయకుండా ప్రజా క్షేత్రంలో కష్టపడే వారికే బీ ఫామ్ ఇవ్వడం పార్టీ విజయానికి దోహదం చేసింది. అలాగే, ఈ ఎన్నికల్లో యోగీ గెలిస్తే భవిష్యత్తులో భారత ప్రధాని రేసులో ముందుంటారని అమిత్ షా ప్రకటించడం పరోక్ష ప్రభావాన్ని చూపెట్టింది. అయితే హత్రాస్ సంఘటన, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ వ్యతిరేక ప్రచారం, త్రిపుల్ తలాక్, కట్టర్ హిందుత్వ వంటి ప్రతికూల అంశాలు ఉన్నా… వాటి ప్రభావాన్ని పరిమితం చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది.