Here is the video of Cheetahs entering India
mictv telugu

ఇండియాలో అడుగుపెట్టిన చీతాలు..వీడియో ఇదిగో

September 17, 2022

 

అరుదైన చిరుత పులులను త్వరలోనే ఆఫ్రికా ఖండం నుంచి మన దేశానికి తీసుకువస్తామని తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాసేపటిక్రితమే అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుత పులుల్లో ఒక రకం) భారత్‌లోకి అడుగుపెట్టాయి. ఆ పులలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే, ఈ అరుదైన పులులను భారత్‌లోకి తీసుకురావడానికి కారణాలను అధికారులు ఇదివరకే తెలియజేశారు. ”భారత్‌లో అంతరించిపోయిన ఆ అరుదైన చిరుత జాతిని తిరిగి వృద్ధి చేసే లక్ష్యంతో, వాటి దిగుమతికి సంబంధించి భారత ప్రభుత్వం నమీబియాతో గతంలో ఓ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా నమీబియా నుంచి 5 మగ, 3 ఆడ చీతాలు ఈ నెల 17కల్లా కునో పార్కుకు చేరుకోనున్నాయి. అదే రోజున ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన ‘చీతాల పునఃపరిచయ కార్యక్రమాన్ని’ ప్రారంభిస్తారు” అని అధికారులు తెలిపారు.

ఇందులో భాగంగా నమీబియాలోని విండ్ హాక్ నుంచి చీతాలతో బయల్దేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ల్యాండ్ అయ్యింది. మహారాజ్ పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు. చీతాలతో వచ్చిన బృందం చినూక్ హెలికాప్టర్‌లో పార్క్‌కు చేరుకుంది. అటు ప్రధాని మోదీ కూడా గ్వాలియర్‌లోని మహారాజ పుర ఎయిర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కునో నేషనల్ పార్క్‌కు వెళ్లి చీతా ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మూడు చీతాలను క్వారంటైన్ ఎ క్లోజర్లలోకి విడుదల చేస్తారు. మిగతా వాటిని అధికారులు విడుదల చేస్తారు. నమీబియా నుంచి మొత్తం 8 చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు.