దోస్తును కాల్చి చంపిన పెళ్లికొడుకు..వీడియో ఇదిగో - MicTv.in - Telugu News
mictv telugu

దోస్తును కాల్చి చంపిన పెళ్లికొడుకు..వీడియో ఇదిగో

June 24, 2022

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఆనందంగా జరుగుతున్న ఓ పెళ్లిలో ఘోరం జరిగింది. ఎంతో సంతోషంతో పెళ్లికొచ్చిన తన స్నేహితుడినే పెళ్లికొడుకు కాల్చి చంపేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వేళ్తే.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లా బ్రహ్మనగర్‌ ఏరియాలో తాజాగా మనీష్‌ మదేషియా అనే వ్యక్తి పెళ్లి జరిగింది. పెళ్లికొచ్చిన బంధువులు, స్నేహితులు నవజంటను దీవిస్తూ తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు.

 

ఈ క్రమంలో మనీష్‌ స్నేహితుడు బాబూ లాల్‌ యాదవ్‌ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి కొడుకును రథంపై ఊరేగిస్తున్న టైంలో అతడి దగ్గర ఉన్న గన్‌ను మనీష్‌ చేతిలో పెట్టి, గాల్లోకి కాల్పులు జరపమన్నాడు. దాంతో పెళ్లికొడుకు మనీష్ గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తుండగా గన్‌ను కిందకు దించాడు. దాంతో ట్రిగ్గర్‌ నొక్కుకు పోయి బుల్లెట్‌ నేరుగా బాబూ లాల్‌ శరీరంలోకి దూసుకుపోయింది. వెంటనే అక్కడున్న స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టంట తెగ వైరల్ అవుతున్నాయి.

మరోపక్క మృతి చెందిన లాల్‌ యాదవ్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్త పెళ్లి కొడుకు మనీష్‌ మేదషియాతోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే మనీష్‌కు రెండు నుంచి ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, మన దేశంలో వివాహ తదితర వేడుకలు, ప్రార్థన స్థలాలు సహా బహిరంగ ప్రాంతాల్లో లైసెన్స్ తుపాకులతో కాల్పులు జరిపినా, చట్టరీత్యా నేరమని నిపుణులు తెలిపారు.