సీతాఫలాలు తినండి.. ఆరోగ్యంతో చిందులు వేయండి! - MicTv.in - Telugu News
mictv telugu

సీతాఫలాలు తినండి.. ఆరోగ్యంతో చిందులు వేయండి!

October 16, 2019

శీతాకాలం ప్రారంభం నుంచి మనకు కమ్మగా తియ్యగా నోరూరిస్తూ లభ్యమయ్యే ఫలం సీతాఫలం. పైన ఆకుపచ్చగా, లోపలంతా తెల్లని గుజ్జు, నల్లని గింజలతో అందంగా ఉంటుందిఈ పండు. తింటున్న కొద్దీ తినాలనిపించే సీజనల్ పండు ఇది. ఫలానా సీజన్‌లో ఫలానా పండు వచ్చిందంటే అది మనకు ప్రకృతి ఇచ్చిన వరం. చలికి చెట్లపై సీతాఫలాలు పగులుతుంటాయి. వాటిని కుండల్లో వరి గడ్డి వేసి మాగబెడతారు. మాగాక తింటే ఆ పండు రుచే వేరు. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వృద్ధులకు కూడా ఈ పండు తినడం చాలా తేలిక. గ్రామాల్లో ఈ చెట్లు విరివిగా వుంటాయి. కొన్ని వాటికవే పెరుగుతుంటాయి. కొందరు ఇంటి పెరట్లో పెంచుకుంటారు. ఈ పండుకు వున్న మరొక ప్రత్యేకత ఏంటంటే దీని చెట్లకు ఎలాంటి రసాయనిక మందులు వాడరు. ఈ పండులో మూడు రకాలు ఉంటాయి. సీతాఫలమే కాకుండా వాటిని పోలిన రామాఫలం, లక్ష్మణఫలాలు ఉన్నాయి. రామాఫలం ఎరుపు వర్ణంలో ఉటుంది. ఈ పండులో రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంది.

ఇక లక్ష్మణఫలం ఆకుపచ్చ వర్ణంలోనే ఉండి పైన ముళ్లుల మాదిరి ఉంటుంది. ఈ పండులో క్యాన్సర్‌తో పోరాడే తత్వాలు వున్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ పండు కొంచెం పుల్లగా ఉంటుంది. సీతాఫలం విషయానికి వస్తే.. ఈ పండులోని పోషక విలువల గురించి తెలిస్తే దీనిని అస్సలు వదిలిపెట్టరు. సీతాఫ‌లం తినడంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలే కాదు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. ఈ ఫలంలో ఏ, సి విటమిన్‌లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇతర పళ్లతో పోల్చుకుంటే ఈ పండు విలువ తక్కువే. జుట్టు ఒత్తుగా పెరగాలి అనుకునే మహిళలు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవాళ్లు ఈ పండును తినడంవల్ల ఆ సమస్యల నుంచి బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే మేగ్నీషియం కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, దాని పనితీరును మెరుగుపరుస్తుంది. 

అలాగే ఈ పండులోని పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. బలహీనంగా వున్న పిల్లలకు సీతాఫలాలను తినిపిస్తే వారిలో మార్పు వస్తుందని అంటున్నారు. డైటింగ్ చేసేవారు కూడా ఈ పండును తింటే ఫలితాలు కనిపిస్తాయి. చర్మ సంరక్షణలో కూడా ఈ పండు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇది తినడంవల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని ముడతల బారినుంచి కాపాడుతుంది. 

Custard apple.

సీతాఫలంతో లాభాలు.. 

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఈ పండును తప్పనిసరిగా తీసుకోవాలి. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది.

 

కొవ్వు అనేది ఈ పండులో వుండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల శక్తి ఉంటుంది. కార్బొహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాములు, విటమిన్ సి 50 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ 4 శాతం లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను ఒకటి లేదా రెండు తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.

 

కండరాలను బలోపేతం చేయడమే కాదు బలహీనత, సాదారణ అలసటను సైతం దూరం చేస్తుంది. వాంతులు, తలనొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది.

ఈ పండును సీజన్ ముగిసేంతదాకా ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమే కాకుండా ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది.

 

ఆస్తమా ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు సీతాఫలాన్ని తినకపోవడం మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే బాగా పండిన పండును తింటే ఎలాంటి బాధా ఉండదు. లివర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం సీతాఫలానికి దూరంగా ఉండాలి.

 

చర్మవ్యాధుల నివారణకు ఈ పండు మందుగా పనిచేస్తుంది. ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది.

 

పేగుల్లో ఉండే హెల్మింత్స్ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్‌ నివారణలో చక్కని పాత్ర పోషిస్తుంది.