Hero Adivi Sesh Remarkable Craze In Multiplex Audience
mictv telugu

మల్టిప్లెక్స్ మెగాస్టార్..!

December 5, 2022

టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరోస్ లో అడివి శేష్ టాప్ లో ఉంటాడు. కథాకథనంలో పట్టు శేష్ విజయాలకు ప్రధాన కారణం. తనలో ఒక దర్శకుడు కూడా ఉండటంతో మేకింగ్ లోను అడివి శేష్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందంటారు. మ్యాటర్ ఉన్నవాళ్లు వేలు పెడితే సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది అన్న దానికి అడివి శేష్ ప్రధాన ఉదాహరణ. దీనికి తగ్గట్టే శేష్ కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తున్నాయి. మొదట్లో కిస్, కర్మ వంటి డిజాస్టర్స్ చిత్రాలు తీసిన అడివిశేష్ కెరీర్ ని మలుపుతిప్పిన మూవీ పంజా. అందులో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రతో అదరగొట్టాడు. ఆ తరువాత దర్శకత్వం పక్కనపెట్టి పూర్తిగా నటనపై ఫోకస్ చేశాడు. ఆ వెంటనే సోలో హీరోగా క్షణం తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఆ తరువాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అడివిశేష్. పట్టిందల్లా బంగారమే. ఆమీతూమీ, గూఢచారి, ఎవరు, మేజర్ ఇప్పుడు హిట్ 2 చిత్రాలతో వరుసగా ఆరు హిట్స్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన తోలి టాలీవుడ్ యంగ్ హీరో అయ్యాడు. అయితే ఈ ఆరు చిత్రాల విజయాలు ఒక లెక్క ఉంటుంది.

కామెడీ డ్రామా ఆమీతూమీ తప్పితే మిగితా ఐదు చిత్రాలు యాక్షన్ థ్రిల్లర్సే. కమర్షియల్ లెక్కలకు దూరంగా న్యాచురాలిటీకి దెగ్గరగా ఉండేవే. క్లాస్, మల్టిప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువగా ఆదరించే జోనర్ ఇది. మల్టిప్లెక్స్, ఓటీటీ, డిజిటల్ మార్కెట్ లో అడివిశేష్ కి తిరుగులేని ఇమేజ్ ఉంది. అందుకే ఎలాంటి పాన్ ఇండియా ఫిగర్ లేకుండానే మేజర్ మూవీ దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యింది. ఇక మేజర్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అడివిశేష్. అయితే మల్టిప్లెక్స్ లో తన బ్రాండ్ ని మరోమెట్టు ఎక్కించిన చిత్రం హిట్ 2. నిజానికి హిట్ 2 కంటే విశ్వక్ సేన్ నటించిన హిట్ మూవీనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ మార్కులు కూడా హిట్ కే ఎక్కువ పడుతున్నాయి. కానీ అర్బన్, మల్టిప్లెక్స్ ఆడియన్స్ లో తనకున్న మెగా క్రేజ్ తో హిట్ 2 మూవీని నిలబెట్టేసాడు అడివి శేష్. దీంతో కొందరు నెటిజన్స్ మల్టిప్లెక్స్ మెగాస్టార్ అంటూ అడివి శేష్ కి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక క్షణం నుండి హిట్ 2 వరకు అన్ని చిత్రాల సక్సెస్ లతో అడివి శేష్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లకు పర్ ఫెక్ట్ అని మరో సారి నిరూపించాడు. హిట్ 2 కూడా థ్రిల్లర్ జోనర్ మూవీనే కావడం.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని మాత్రమే ఆకట్టుకునే మూవీ కావడం గమనార్హం.