చదువుకునే సమయంలో ఇతర ఆలోచనలతో, పనులతో భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హీరో ధనుష్ నేటి తరానికి సూచించారు. తన జీవితంలో జరిగిన సంఘటనను ఉదాహారణగా చెబుతూ తన అభిమానులెవరూ కూడా తనలాగా చదువును నిర్లక్ష్యం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తన కొత్త సినిమా ‘వాది’ సినిమా ఆడియో విడుదల వేడుకలో తన స్టూడెంట్ లైఫ్‌ను గుర్తుచేసుకున్నారు ధనుష్.
ఈ సందర్భంగా ఆయన ‘‘చదువుకోవాల్సిన సమయంలో నేను అల్లరి పనులు చేసేవాణ్ని. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్‌లో చేరాను. ట్యూషన్ టీచర్ ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పలేకపోయేవాణ్ని. కొన్ని రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్ మానేశా. ఆపై ఆమెను కలుసుకునేందుకు ట్యూషన్ బయట వేచి చూసేవాణ్ని. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్‌తో సౌండ్ చేసేవాణ్ని. దాంతో, టీచర్ నాపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీరంతా బాగా చదువుకుని, పరీక్షలు పాసై ఉన్నత స్థానంలో ఉంటారు. బయట వాహనంతో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందే’’ అని అక్కడున్న వారితో అన్నారట. ఆయన చెప్పినట్టు తమిళనాడులో నేను డ్యాన్స్ చేయని వీధంటూ ఏదీ లేదు.. వెనక్కి తిరిగి చూస్తే.. నేనెందుకు తరగతులకు హాజరుకాలేదు? అని ఇప్పటికీ చింతిస్తున్నా. మీరు నాలాగా చేయకండి. ఆనాడు మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే వారి కష్టం ఇప్పుడర్థమవుతోంది..”అని ధనుష్ తన ఫ్యాన్స్‌తో ఆనాటి రోజుల గురించి చెప్పాడు.
ఇక టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన బైలింగ్వుల్ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. విద్యా వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో ‘సార్’ (Sir) పేరుతో అదే రోజు విడుదలకానుంది. ఈ సినిమాలో చక్కటి సందేశంతోపాటు కామెడీ కూడా ఉంటుందని , 90ల్లో సాగే కథ ఇది అని తెలిపారు ధనుష్.